Paris Olympics 2024 Mascot Phryges : ఒలింపిక్స్ ఈ పేరు వినగానే చాలా మందికి ఐదు రింగుల చిహ్నమే గుర్తొస్తుంది. దీంతో పాటే ఓ ముద్దొచ్చే మస్కట్ కూడా మరికొంతమందికి గుర్తొస్తుంది. అయితే ఈ సారి పారిస్ 2024లో పెద్ద పెద్ద నీలి కళ్లతో ఉన్న ఫ్రీజ్ అనే మస్కట్ దర్శనమిస్తోంది. ఈ మస్కట్లోనే చిన్న చిన్న మార్పులు చేసి పారా ఒలింపిక్స్ కోసం కూడా సెలెక్ట్ చేశారు. ఈ సందర్భంగా ఫ్రీజ్ ఎలా రూపొందించారు, దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
1968 ఒలింపిక్ గేమ్స్ నుంచి ఈ మస్కట్ భాగమవుతూ వస్తోంది. ఆతిథ్య దేశాలు తమ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ మస్కట్లను తయారు చేయడం ప్రారంభించాయి. 1968 ఫ్రాన్స్ వేదికగా నిర్వహించిన ఒలింపిక్స్‌లో మస్కట్ షూస్‌ను తయారు చేశారు. దీని భారీ తలలో ఒలింపిక్ రింగ్స్ కనపడేలా రూపొందించారు. అప్పట్లో ఈ మస్కట్‌ను తయారు చేసిన డిజైనర్‌కు పెద్దగా సమయం దొరకకపోవడం వల్ల ఇలా తయారు చేశాడని అంటుంటారు.
అనంతరం బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో బింగ్ డ్వెన్‌డ్వెన్ అనే పాండాను మస్కట్‌గా తయారు చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో మిరాయిటోవానును మస్కట్‌గా ఎంపిక చేశారు.
ఇక ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ విషయానికొస్తే ఫ్రెంచి సంప్రదాయంలో ఫ్రీజియన్ క్యాప్ ఎంతో ముఖ్యమైనంది. దీని ఆధారంగానే ఫ్రీజ్ మస్కట్‌ను రూపొందించారు. ఫ్రాన్స్ చరిత్రలో ఇదో కీలక భాగం. క్రీడలు అన్నింటిని ఇవి మార్చగలవు అనే సూత్రంతోనే ఈ మస్కట్‌ను తయారుచేశారు. అలానే ఆటల్లోని సమష్టితత్వాన్ని తెలియజేస్తూ దీనిని తయారుచేశారు.