Paris Olympics 2024 Hockey :పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా తాజాగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 1 (4)- 1 (2) తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది. ఈ గెలుపుతో నేరుగా సెమీస్‌కు చేరుకుంది. తొలుత ఈ మ్యాచ్ 1-1తో టై అవ్వగా, ఆ తర్వాత షూటౌట్‌లో భారత్ 4-2తో గెలుపొందింది. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా స్కోర్ చేయలేదు.
అయితే రెండో క్వార్టర్‌లో భారత్ డిఫెండర్ అమిత్ రోహిదాస్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. హాకీ స్టిక్‌తో బ్రిటన్ ఆటగాడిని ఉద్దేశపూర్వకంగా కొట్టాడని అక్కడి రిఫరీలు రోహిదాస్‌ను రెడ్ కార్డ్ ద్వారా గేమ్ నుంచి బయటికి పంపించారు. దీంతో భారత్ 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. సరిగ్గా 22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా ఓ గోల్ సాధించి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఇక 27వ నిమిషంలో బ్రిటన్ ప్లేయర్ మోర్టన్ లీ గోల్ చేయడం వల్ల స్కోర్ సమం అయింది. ఆ తర్వాతి రెండు క్వార్టర్స్‌లోనూ ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది.
మరోవైపు భారత హాకీ జట్టు ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో 12 పతకాలను గెలుచుకుంది. అందులో 8 స్వర్ణాలు, 3 కాంస్యాలు, ఓ రజత పతకం ఉంది. దీంతో ఈ పారిస్ ఒలింపిక్స్‌లోనూ కూడా అదరగొట్టి మరో పతాకాన్ని ఖాతాలో వేసుకోవాలని భారత్ హాకీ జట్టు ఉవ్విళ్లూరుతోంది.