Paris Olympics 2024 Day 1 India:పారిస్ ఒలింపిక్స్ 2024లో తొలిరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. రైఫిల్ షూటింగ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో భారత్‌కు పరాభవం ఎదురవ్వగా, సింగిల్స్ పిస్టల్ క్వాలిఫికేషన్‌లో మను బాకర్ అదరగొట్టింది. 580.27 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో 20 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన భారత షూటర్‌గా మను బాకర్ రికార్డు సృష్టించింది. 2004 ఒలింపిక్స్‌లో ఇదే విభాగంలో సుమా శిరూర్ ఫైనల్‌కు చేరింది. కాగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ జులై 28న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి.
మరోవైపు బ్యాడ్మింటన్‌లో భారత అథ్లెట్లు హవా కొనసాగింది. పురుషుల సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో మన షట్లర్లు సత్తా చాటారు. తొలుత సింగిల్స్ గ్రూప్ స్టేజ్‌లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుగా ఆడి ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టికరిపించాడు. పోటీలో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించిన లక్ష్యసేన్ 21-08తో తొలి సెట్ సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైనా 22-20తేడాతో నెగ్గి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.
కాగా, పురుషుల డబుల్స్‌లో భారత ద్వయం సాత్విక్- చిరాగ్ శెట్టి రఫ్పాడించారు. ఫ్రెంచ్ జోడీ లుకస్- రోనమ్ను ఢీకొట్టిన సాత్విక్- చిరాగ్ ద్వయం వరుస సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించారు. 21-17, 21-14 తేడాతో ఫ్రెంచ్ జోడీని మట్టికరిపించి, గ్రూప్ స్టేజ్ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఇక జులై 29న అటు సింగిల్ ఈవెంట్లో లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్- చిరాగ్ రెండో రౌండ్ ఆడనున్నారు. ఇక టేబుల్ టెన్నిస్‌లో హర్మీత్ హర్మీత్ దేశాయ్ విజయం సాధించాడు. ప్రిలిమినరీ రౌండ్‌లో ప్రత్యర్థి జోర్డాన్‌పై 4-0 తేడాతో నెగ్గాడు.