Paris Olympics 2024 Arshad Nadeem Prize Money :పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో గోల్డ్ మెడల్ సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో ఏకంగా 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడిని ముద్దాడ్డాడు. దీంతో ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ 40 ఏళ్ల స్వర్ణ పతకం నిరీక్షణకు తెరదించాడు. దీంతో అర్షద్ నదీమ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే అర్షద్ ను పాక్ క్రికెటర్లు, సెలబ్రిటీలు అభినందిస్తున్నారు. ఇదే సమయంలో అర్షద్‌కు పాక్ ప్రభుత్వం భారీ నజరానా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎంతంటే?
రివార్డుల వెల్లువ -పారిస్ ఒలింపిక్స్ గోల్ట్ మెడల్ విజేత అర్షద్‌ను పాక్ ప్రభుత్వం ఘనంగా సత్కరించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా అతడికి భారీగా రివార్డులు, అవార్డులను ప్రకటించనున్నారట. నదీమ్‌కు 150 మిలియన్ పాకిస్థాన్ రూపాయల (రూ.4.5 కోట్లు) కన్నా ఎక్కువ మొత్తం అందుకోనున్నట్లు సమాచారం.
ఇందులో సింధ్ ముఖ్యమంత్రి ప్రకటించిన 50 మిలియన్ పాకిస్థాన్ రూపాయలు, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ప్రకటించిన PKR 100 మిలియన్లు, పంజాబ్ గవర్నర్ సర్దార్ సలీం హైదర్ ఖాన్ PKR 2 మిలియన్ రివార్డులు ఉన్నాయి. అలాగే అర్షద్ నదీమ్ ప్రతిభను మెచ్చిన ప్రముఖ పాకిస్థాన్ సింగర్ అలీ జఫర్ PKR 1 మిలియన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇంతే మొత్తాన్ని నదీమ్‌కు తన ఫౌండేషన్ ద్వారా ఇవ్వనున్నట్లు క్రికెటర్ అహ్మద్ షాదాజ్ వెల్లడించారు.
మరిన్ని సత్కారాలు -మరోవైపు, నదీమ్ స్వదేశానికి చేరుకోగానే అతడిని బంగారు కిరీటంతో సత్కరించనున్నట్లు సింధ్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అర్షద్ నదీమ్ ప్రతిభకు గుర్తింపుగా అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు అక్కడి రేడియో పాకిస్థాన్ వెల్లడించింది.