Paralympics 2024 Medals Tally :పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 20కు చేరింది. మంగళవారం భారత పారా అథ్లెట్‌లు అద్భుత ప్రదర్శనతో రెండు రజత పతకాల సహా మొత్తం ఐదు పతకాలు దేశానికి అందించారు. జావెలిన్ త్రోలో భారత్‌కు మరో రెండు పతకాలు వచ్చాయి.
F46 విభాగం ఫైనల్లో పారా అథ్లెట్ అజీత్ సింగ్ ఈటెను 65.62 మీటర్ల విసిరి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. ఇదే విభాగంలో పోటీ పడిన మరో పారా అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జార్ 64.96 మీటర్లు విసిరి మూడోస్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకున్నాడు. అటు హైజంప్‌లో కూడా భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి.
ఇక T63 విభాగంలో శరద్ కుమార్ 1.88 మీటర్లు గెంతి రెండోస్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో బరిలోకి దిగిన మరియప్పన్ తంగవేలు 1.85 మీటర్లు గెంతి కాంస్య పతకాన్ని సాధించాడు. అటు మహిళల 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో దీప్తి జీవాంజి దేశానికి కాంస్య పతకాన్ని అందించింది. ఫైనల్లో 55.82 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఇప్పటివరకు పారాలింపిక్స్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్య పతకాలు వచ్చాయి.
పారాలింపిక్స్ సెప్టెంబర్ 4 ఈవెంట్స్
సైక్లింగ్:పురుషుల C-2 వ్యక్తిగత రోడ్ టైమ్ ట్రయల్ (పతక రౌండ్): అర్షద్ షేక్, రాత్రి.11.57 నుంచి; మహిళల సి1-3 వ్యక్తిగత రోడ్ టైమ్ ట్రయల్ (పతక రౌండ్): జ్యోతి గదెరియా, రాత్రి 12.32 నుంచి
షూటింగ్ : మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ (క్వాలిఫికేషన్): నిహాల్ సింగ్, రుద్రాంశ్ ఖండేవాల్, మధ్యాహ్నం 1 నుంచి
టేబుల్ టెన్నిస్ : మహిళల సింగిల్స్, క్లాస్-4 (క్వార్టర్స్): భవీనా పటేల్ × యింగ్ (చైనా), మధ్యాహ్నం 2.15 నుంచి