Pakisthan Cricketer Bismah Maroof Retirement :ప్రపంచ ఉత్తమ మహిళా క్రికెటర్‌లలో ఒకరిగా పేరు పొందిన పాక్ ప్లేయర్ బిస్మా మరూఫ్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన ఆమె తాజాగా అన్ని క్రికెట్ ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించింది. 32 ఏళ్ల వయసులోనే ఆమె ఆకస్మికంగా క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బిస్మా మరూఫ్ మాట్లాడుతూ - "నేను చాలా ఇష్టపడే ఆట నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది సవాళ్లు, విజయాలు, మరపురాని జ్ఞాపకాలతో నిండిన అద్భుతమైన ప్రయాణం. మొదటి నుంచి ఇప్పటి వరకు నా క్రికెట్ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి, నా ప్రతిభను ప్రదర్శించేందుకు వేదికను అందించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా కోసం తొలిసారిగా తల్లిదండ్రుల పాలసీని అమలు చేయడంలో పీసీబీ సహకారం అమూల్యమైంది. తల్లిగా ఉంటూనే అత్యున్నత స్థాయిలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కలిగింది." అని తెలిపింది.
కాగా, పాపులర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన బిస్మా మరూఫ్ పాక్ తరఫున టీ20లు, వన్డేలకు ప్రాతినిధ్యం వహించింది. మొత్తం 276 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. పాక్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఉమెన్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.
- డాక్టర్ కావాలనుకున్న మరూఫ్
మరూఫ్ లాహోర్‌లో 1991 జులై 18న ఒక కాశ్మీరీ కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకుంది. అయితే కళాశాల సమయంలో క్రికెట్‌పై ఆమెకు ఆసక్తి పెరిగింది. అనంతరం క్రికెట్ కోసం చదువును వదిలేసింది. - బిస్మా మరూఫ్ క్రికెట్ కెరీర్
బిస్మా 2006లో భారత్‌పై వన్డేల్లో అరంగేట్రం చేసింది. వన్డేల్లో బిస్మా 135 మ్యాచ్‌లు ఆడి 3350 పరుగులు చేసింది. 44 వికెట్లు కూడా తీసింది. ఆమె అత్యధిక స్కోరు 99, 50 ఓవర్ల ఫార్మాట్‌లో మొత్తం 21 హాఫ్ సెంచరీలు చేసింది. ఆమె ICC మహిళల 50 ఓవర్ల ప్రపంచ కప్ (2009, 2013, 2017, 2022) నాలుగు ఎడిషన్లలో పాల్గొంది. న్యూజిలాండ్‌లో జరిగిన 2022 టోర్నీకి కెప్టెన్‌గా వ్యవహరించింది.