Pakistan T20 World Cup 2024 :ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో అనూహ్య ఫలితాలు, ఊహించని పరిస్థితులు గ్రూప్ స్టేజ్‌ని ఇంట్రెస్టింగ్ మార్చాయి. చివరి మ్యాచ్ వరకు టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలో దిగిన టీమ్‌లు సూపర్ 8కి క్వాలిఫై కాని పరిస్థితి కూడా నెలకొంది. చిన్న టీమ్‌లు ఇచ్చిన షాక్‌కి పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్ ఏకంగా ఎలిమినేట్ అయ్యాయి. ముఖ్యంగా పాకిస్థాన్ గ్రూప్ స్టేజ్‌లోనే ఎలిమినేట్ కావడంపై కొందరు క్రికెటర్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ కూడా పాకిస్థాన్ టీమ్ పరిస్థితిపై స్పందించాడు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. "టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ ఎలిమినేట్ కావడం బాధగా ఉంది. వారు నెక్స్ట్ సీజన్‌కి మెరుగ్గా వస్తారని, షాహిద్ అఫ్రిది వంటి సీనియర్లు దారి చూపించాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు.
పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు
పాకిస్థాన్ తన మొదటి మ్యాచ్‌లో యూఎస్‌ఏతో ఓడిపోవడం పెద్ద దెబ్బ కొట్టింది. అనంతరం ఇండియాతో కూడా ఓడిపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో మ్యాచ్‌లో కెనడాపై గెలిచినా ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే అప్పటికే ఇతర టీమ్‌ల రిజల్ట్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. కీలక మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో యూఎస్‌ఏ క్వాలిఫై అయింది, పాక్ ఎలిమినేట్ అయింది.
ఐర్లాండ్, యూఎస్‌ఏ మ్యాచ్ వర్షం కారణంగా క్యాన్సిల్ అవడం పాకిస్థాన్ కొంప ముంచింది. ఇందులో యూఎస్‌ఏ ఓడిపోయి ఉంటే, పాక్‌కి అవకాశం ఉండేది. ఈ రోజు జూన్ 16న ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచి ఉంటే సూపర్ 8కి చేరుకునేది. కానీ యూఎస్‌ఏ ఓ పాయింట్ అందుకుని, క్వాలిఫై అయిపోయింది. ఈ రోజు ఐర్లాండ్, పాకిస్థాన్ పోరు నామమాత్రమే.