NZ VS PAK Champions Trophy 2025 : తాజాగా స్వదేశంలో ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీని ఘోర పరాజయంతో ప్రారంభించింది పాకిస్థాన్ జట్టు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఇప్పుడు పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఆ జట్టు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జింబాబ్వే-ఐర్లాండ్‌తో సిరీసుల్లో ఆడుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలోకి రావాలంటూ చురకలంటించాడు.
"ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్ వైదొలగాలి. జింబాబ్వే, ఐర్లాండ్‌ల మధ్య జరగనున్న సిరీస్‌లో పోటీపడాలి. అక్కడ గెలిచాక మా టీమ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీపడే అర్హత ఉన్నట్లు. అయితే నేను ఇలా అనడానికి ఓ కారణం ఉంది. మా టీమ్ ఆటతీరు ఇలానే ఉంది. గత ఆరేడేళ్ల నుంచి మా జట్టు క్రికెట్ స్టాండర్ట్స్ అతి ఘోరంగా పడిపోయాయి" అని కమ్రాన్ అక్మల్ అన్నాడు.
వాళ్లను చూసి నేర్చుకోండి
"పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కివీస్ నిలకడైన ఆటతీరును కనబరిచింది. మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ ఆ జట్టు బ్యాటర్లు పరుగులు సాధించారు. తొలుత నెమ్మదిగా ఆడి మ్యాచ్ తమ కంట్రోల్లోకి వచ్చిందని భావించాక మళ్లీ దూకుడు పెంచారు. పరిణితి చెందిన జట్టు చేసే పని కూడా అదే. కనీసం కివీస్‌ను చూసైనా సరే పాక్ నేర్చుకోవాలి. టామ్ లేథమ్, విల్ యంగ్ నిలకడగా ఆడి సెంచరీ సాధించారు" అంటూ కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు.