Pakistan Champions Trophy 2025 :డిఫెండిగ్ ఛాంపియన్ హోదాలో ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఓడిన పాక్, భారత్‌తో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. అలా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి, సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిస్తే పాక్ సెమీస్ ఆశలు సజీవంగానే ఉండేవే.
కానీ, బంగ్లాను ఓడించిన కివీస్ తమతోపాటు భారత్ సెమీస్ బెర్త్‌ను కన్ఫార్మ్ చేసింది. అలా 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంత గడ్డపై ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్, కనీసం సెమీ ఫైనల్ దాకా చేరకుండానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. అవేంటంటే?
16ఏళ్ల తర్వాత తొలిసారి
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 2009 ఎడిషన్‌కు ఆతిథ్యమిచ్చిన సౌతాఫ్రికాకు ఇదే పరిస్థితి ఎదురైంది. 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో సఫారీ జట్టు మూడు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో నెగ్గి, మిగిలిన రెండింటిలో ఓడారు. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు.