తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెగా టోర్నీలో పాక్​ను తక్కువ అంచనా వేయొద్దు- సెమీస్​కు వస్తే డబుల్‌ డేంజర్ : రవిశాస్త్రి - RAVI SHASTRI ON PAKISTAN

పాక్ వేదికగా ఫిబ్రవరి 19నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ- ఆ జట్టు సెమీ ఫైనల్ చేరితే డబుల్ డేంజరెస్​గా మారుతుందన్న రవిశాస్త్రి

Ravi Shastri On Pakistan
Ravi Shastri On Pakistan (AP)

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2025, 3:44 PM IST

Updated : Feb 10, 2025, 3:49 PM IST

Ravi Shastri On Pakistan : దాయాది దేశం పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాక్ ఆతిథ్య జట్టు హోదాలో బరిలో దిగనుంది. ఈ క్రమంలో పాకిస్థాన్​ను తక్కువగా అంచనా వేయొద్దని టీమ్​ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. భయంకరమైన పేస్ విభాగం, స్వదేశంలో టోర్నీ ఆడుతుండడం వల్ల పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక శక్తిగా మారగలదని హెచ్చరించాడు.

పాకిస్థాన్ యంగ్ ప్లేయర్ సయీమ్ ఆయుబ్ పాక్‌ జట్టులో లేడని, అతడు నాణ్యమైన క్రికెటర్ అని రవిశాస్త్రి కొనియాడాడు. అయినప్పటికీ పాక్​ను తక్కువగా అంచనా వేయొద్దని చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్​లో గత కొద్ది నెలలుగా పాకిస్థాన్ ప్లేయర్లు బాగా ఆడుతున్నారని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాలోనూ మెరుగైన ప్రదర్శన చేశారని పేర్కొన్నాడు. "ఇక స్వదేశంలో పాక్​ను ఆపడం చాలా కష్టం. ఎవరైనా సరే హోంగ్రౌండ్స్​లో డేంజరస్​గా ఉంటారు. పాకిస్థాన్‌ కనుక సెమీస్​కు చేరుకుంటే ఆ జట్టు డబుల్ డేంజరస్​గా మారుతుంది" అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

సంచలనాలు సృష్టించే ప్లేయర్లు పాక్ సొంతం : పాంటింగ్
రవిశాస్త్రి వ్యాఖ్యలతో తాను అంగీకరిస్తున్నానని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి సయీబ్‌ ఆయుబ్‌ దూరం అయ్యాడని, అతడు లేనిలోటు పాక్​కు ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కానీ, బ్యాటింగ్‌ తోపాటు బౌలింగ్​లోనూ సంచలనాలు చేయగల సమర్థులు పాక్‌ సొంతమని కొనియాడాడు.

"పాకిస్థాన్ ఫాస్ట్‌ బౌలింగ్​ను గమనిస్తే అర్థమవుతుంది. షహీన్‌ షా అఫ్రిది, నసీమ్ షా డేంజరస్​గా ఉన్నారు. ఇటీవల సిరీస్​లలో వారి పెర్ఫార్మెన్స్ బాగుంది. వారు ఎంతటి బ్యాటింగ్‌ లైనప్‌నైనా ఇబ్బంది పెట్టగలరు. పాకిస్థాన్​కు బాబర్ అజామ్ ఫామ్ చాలా కీలకం. బ్యాటింగ్ విషయంలో బాబర్ అజామ్, రిజ్వాన్ మరోసారి కీలకం కానున్నారు. వారిద్దరూ రాణిస్తే మాత్రం పాక్‌ ప్రమాదకరంగా మారుతుంది. స్వదేశంలో ఆడుతుండటం ప్రయోజనమే. కానీ మరో రకంగా ఒత్తిడితో కూడుకున్నదే. సొంత ప్రేక్షకుల మధ్య ఆడితే మద్దతు బాగుంటుంది. తమదైన రోజున పెద్ద జట్లనూ ఓడించగల సత్తా పాక్​కు ఉంది" అని పాంటింగ్ విశ్లేషించాడు.

పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి జరగనుంది. దాయాది దేశం పాకిస్థాన్ తన తొలి మ్యాచ్​ను కివీస్​తో అదే రోజున తలపడనుంది. ఫిబ్రవరి 23న దుబాయ్​లో భారత్​ను ఢీకొట్టనుంది. కాగా, భారత్ ఆడే మ్యాచ్​లన్నీ దుబాయ్​లో జరగనున్నాయి.

Last Updated : Feb 10, 2025, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details