Olympics 2036 In India :విశ్వ క్రీడలైన ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ రెండీ అవుతోంది!. ఈ మేరకు 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేస్తూ భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ)- అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి(ఐఓసీ) ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు అధికారికంగా లేఖ పంపినట్లు తెలుస్తోంది. ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను ఐఓఏ అక్టోబర్ 1న పంపించినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు సమాచారం. దీంతో ఒలింపిక్స్ నిర్వహణ కోరికను నెరవేర్చుకునేందుకు తొలి అడుగుపడినట్లు అయింది. దీనికంటే ముందు ఐఓసీతో 2036 ఒలింపిక్స్ నిర్వహించే అంశంపై భారత్ అనధికార చర్చలు జరిపింది. తాజాగా పరిణామంతో ఇక దీనిపై నిరంతర చర్చలు జరుగుతాయి.
అయితే వచ్చే ఏడాది జరిగే ఐఓసీ ఎన్నికలు జరిగేంత వరకు హోస్ట్‌పై నిర్ణయం తీసుకోరు. మరోవైపు, 2036 ఒలింక్స్ నిర్వహణ కోసం చాలా దేశాలతో భారత్ పోటీ పడాల్సి ఉంటుంది. సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియే, వంటి అనేక దేశాలు ఒలింపిక్స్ నిర్వహణపై ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్ మొదటి 2032 ఒలింపిక్స్ నిర్వహించేందుకు ఆసక్తి చూపించింది. కానీ కొన్ని కారణాల వల్ల 2036లో నిర్వహించాలని నిర్ణయించుకుంది.