తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టెస్టులోనూ భారత్ ఓటమి- స్వదేశంలో సిరీస్ చేజారే - IND VS NZ 2ND TEST 2024

స్వదేశంలో టీమ్ఇండియా వరుసగా రెండో ఓటమి- సిరీస్ దక్కించుకున్న కివీస్

India vs New Zealand
India vs New Zealand (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 26, 2024, 4:00 PM IST

Updated : Oct 26, 2024, 6:34 PM IST

IND vs NZ 2nd Test 2024 :న్యూజిలాండ్​తో రెండో టెస్టులోనూ టీమ్ఇండియా ఓడింది. పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో కివీస్ 112 పరుగుల తేడాతో నెగ్గింది. 359 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్​లో బరిలోకి దిగిన టీమ్ఇండియా 245 వద్ద ఆలౌటైంది. యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ (77 పరుగులు) హాఫ్ సెంచరీ చేయగా, రవీంద్ర జడేజా (42) రాణించాడు. దీంతో స్వదేశంలో వరుసగా రెండో టెస్టులో ఓటమి మూటగట్టుకుంది. కాగా, మూడు టెస్టుల సిరీస్​ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2- 0తో దక్కించుకుంది. కాగా, 12ఏళ్ల తర్వాత భారత్ తొలిసారి స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోయింది. అటు భారత్ గడ్డపై టెస్టు సిరీస్ కైవసం చేసుకోవడం కివీస్​కు ఇదే తొలిసారి.

ఇక 359 ఛేదనలో టీమ్ఇండియాకు మళ్లీ పేలవ ఆరంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశ పర్చాడు. కేవలం 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత శుభ్​మన్ గిల్ (23 పరుగులు)తో కలిసి జైస్వాల్ కాసేపు భాగస్వమ్యం నిర్మించే ప్రయత్నం చేశాడు. దీంతో లంఛ్​ సమయానికి భారత్‌ 81/1 స్కోరుతో మెరుగైన స్థితిలో కనిపించింది. కానీ,ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (17 పరుగులు), రిషభ్ పంత్ (0), సర్ఫరాజ్ ఖాన్ (9), వాషింగ్టన్ సుందర్ (21) వరుసగా విఫలమయ్యారు. ఆఖర్లో జడేజా, అశ్విన్ (18)తో కలిసి పోరాడినా ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు.

అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో 198/5 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్‌ 255 పరుగులకు ఆలౌటైంది. టామ్ లేథమ్ (86 పరుగులు), గ్లెన్ ఫిలిప్ (48 పరుగులు), టామ్ బ్లండెల్ (41 పరుగులు) రాణించారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 103 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని భారత్‌కు 359 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

స్కోర్లు

  • న్యూజిలాండ్ : 259-10 & 255- 10
  • భారత్ : 156- 10 & 245-10
Last Updated : Oct 26, 2024, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details