WTC Points Teamindia Newzealand : మ్యాచ్‌లు ముగుస్తున్న కొద్దీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2023-25) ఫైనల్ రేసు రసవత్తరంగా మారుతోంది. టాప్-2లో నిలిచి తుది పోరులో ఆడటం కోసం ఐదు జట్లు (టీమ్ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక) పోటీ పడుతున్నాయి. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమ్ ఇండియాకు బాగా కలిసొచ్చే విషయం ఒకటి చోటు చేసుకుంది. ఇంతకీ అదేంటంటే?
డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ఉన్న న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లో భాగంగా తాజాగా జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా న్యూజిలాండ్‌కు పెనాల్టీ విధించింది ఐసీసీ. ర్యాంకింగ్స్ టేబుల్లో మూడు పాయింట్లు కోత విధిస్తున్నట్లు పేర్కొంది. దీంతో టీమ్ ఇండియాకు కలిసొచ్చినట్టైంది. ఈ కోత వల్ల ప్రస్తుతం అగ్రస్థానంలో (61.11) ఉన్న టీమ్ ఇండియా, తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
న్యూజిలాండ్ ఈ కోత వల్ల ప్రస్తుతం 47.92కు పడిపోయింది. నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ఒకవేళ ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న సిరీస్‌లో మరో రెండు విజయాలు సాధించినా 55.36 వరకు మాత్రమే వెళ్తుంది. అయితే న్యూజిలాండ్‌కు పాయింట్ల కోత విధించడంతో సౌతాఫ్రికా (59.26), ఆస్ట్రేలియా (57.26), శ్రీలంక (50) రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. వారి పాయింట్ల శాతం కూడా ఎక్కువ ఉండడంతో, న్యూజిలాండ్ టాప్ 2లోకి వెళ్లడం కష్టమే.