తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టులకు సౌథీ గుడ్​ బై- WTC ఫైనల్​కు ముందే రిటైర్మెంట్! - TIM SOUTHEE RETIREMENT

కెరీర్​కు గుడ్​బై చెప్పిన న్యూజిలాండ్ పేసర్- అదే ఆఖరిదని వెల్లడి!

Tim Southee Retirement
Tim Southee Retirement (Source : Getty Images)

By ETV Bharat Sports Team

Published : Nov 15, 2024, 9:35 AM IST

Tim Southee Retirement :న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్ టిమ్‌ సౌథీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్​కు గుడ్​ బై చెబుతున్నట్లు వెల్లడించాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరీస్​ తన కెరీర్​లో ఆఖరిదని సౌథీ పేర్కొన్నాడు. ఈ సిరీస్​లో కివీస్ హామిల్టన్ వేదికగా మూడో టెస్టు ఆడనుంది. కాగా, సౌథీకి అదే ఆఖరి టెస్టు మ్యాచ్ కానుంది. అయితే సౌథీ టెస్టు కెరీర్ ప్రారంభించింది కూడా ఇంగ్లాండ్​ మ్యాచ్​తోనే కావడం విశేషం.

'న్యూజిలాండ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అరుదైన గౌరవం. చిన్నప్పటి నుంచి అదే కలతో పెరిగా. ఆ కలను సాకారం చేసుకోగలిగాను. నా హృదయంలో టెస్టు క్రికెట్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. నా టెస్టు కెరీర్‌ ప్రారంభమైన జట్టుపైనే చివరి మ్యాచ్‌ ఆడబోతుండటం ఆసక్తికరం. మూడు స్టేడియాలు నాకెంతో స్పెషల్. అందులో హామిల్టన్ మైదానంలో నా చివరి మ్యాచ్‌ ఆడాలని అనుకుంటున్నా' అని సౌథీ పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్ 2025 వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు అర్హత సాధించినా జట్టులో సౌథీ మాత్రం ఉండడు.

2008లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సౌథీ దాదాపు 16ఏళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్​లో ఇప్పటివరకూ 104 టెస్టులు ఆడిన సౌథీ 385 వికెట్లు పడగొట్టాడు. అటు బ్యాటింగ్​లోనూ తన మార్క్ చూపించిన టిమ్ 2,185 పరుగులు చేశాడు. ఇక 161 వన్డేల్లో 221, 125 టీ20ల్లో 164 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 2011 నుంచి ఐపీఎల్​లో పలు ఫ్రాంచైజీలకు ఆడిన సౌథీ, 54 మ్యాచ్​ల్లో 47 వికెట్లు తీశాడు. కాగా, గతనెల సౌథీ టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా వదులుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details