Kane Williamson Captaincy:న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్ ఆఖరి మ్యాచ్ తర్వాత విలియమ్సన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడమే కాకుండా 2024-25 సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా వదులుకుంటున్నట్లు చెప్పాడు. ఇక న్యూజిలాండ్ సమ్మర్ సీజన్లో ఓవర్సీస్ లీగ్‌ల్లో ఆడనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
'న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప అవకాశంగా భావిస్తా. కివీస్‌కు ఇంకా సహకారం అందిచాలనుకుంటున్నా. అందుకే ఇకపై కూడా జట్టులో కొనసాగుతాను. ఇక నా వ్యక్తిగత జీవితం చాలా మారిపోయింది. నా ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించి, వారితో గడపడం కూడా నాకు ముఖ్యం' అని కేన్ అన్నాడు. అయితే ప్రస్తుత పొట్టికప్ టోర్నీలో కివీస్ ఓటమియే కేన్ నిర్ణయానికి కారణం అని తెలుస్తోంది. గ్రూప్ దశలో తొలి రెండు మ్యాచ్ (అఫ్గానిస్థాన్, వెస్టిండీస్‌పై)ల్లో ఓడిన కివీస్, అనంతరం పసికూనలు ఉగాండ, పపువా న్యూ గినియాపై నెగ్గింది. దీంతో నాలుగు పాయింట్లతో ముడో స్థానానికి పరిమితమైన కివీస్ టోర్నీ చరిత్రలో తొలిసారి సెమీస్ చేరకుండా ఇంటిబాట పట్టింది.
కెప్టెన్‌గా రికార్డులు:కాగా, విలియమ్సన్ కెప్టెన్సీలో కివీస్ 2021 డబ్ల్యూటీసీ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక కేన్ నాయకత్వంలో కివీస్, 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్ దాకా వెళ్లి రన్నరప్‌గా నిలిచింది. 2016, 2022 టీ20 వరల్డ్‌కప్, 2023 వన్డే వరల్డ్‌కప్‌ల్లోనూ కివీస్ సెమీఫైనల్ దాకా చేరుకుంది. విలియమన్సన్ తన కెరీర్లో 40 టెస్టులు, 91 వన్డేలు, 75 టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక వైట్‌బాల్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విలియమ్సన్ తాజాగా తప్పుకోగా, టెస్టు బాధ్యతలు ఎప్పుడో వదిలేశాడు.