Neeraj Chopra New Coach :భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా శనివారం తన కొత్త కోచ్ పేరును వెల్లడించారు. ప్రముఖ జావెలిన్ లెజెండ్ జాన్ జెలెజ్నీ వద్ద శిక్షణ తీసుకోనున్నట్లు తెలిపారు. తన కెరీర్లోని ఓ ఉత్తేజకరమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక జాన్ జెలెజ్నీ కెరీర్ విషయానికి వస్తే, 1992, 1996 , 2000 ఒలింపిక్ క్రీడల్లో పసిడి పతకాన్ని ముద్దాడిన ఈ స్టార్ అథ్లెట్, ఆల్టైమ్ టాప్ 10 బెస్ట్ త్రోలలో ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా నాలుగు సార్లు ప్రపంచ రికార్డును బ్రేక్ చేసిన ఘనత కూడా ఈయన సొంతం. 1996లో జర్మనీ వేదికగా జరిగిన ఓ ఈవెంట్లో 98.48 మీటర్లను బల్లెం విసిరి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఎవరూ దాన్ని బద్దలు కొట్టకపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా, టోక్యో 2020 ఒలింపిక్స్లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత జాకుబ్ వాడ్లెజ్ రజత పతకాన్ని, విటెజ్స్లావ్ వెసెలీ కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరికీ కోచ్గా జాన్ జెలెజ్నీ వ్యవహరించారు. ఇక రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ , మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన బార్బోరా స్పాటకోవాకు కూడా జాన్ జెలెజ్నీ శిక్షణ ఇచ్చారు.