Neeraj Chopra US Magazine :భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ అమెరికా మ్యాగజైన్ 'ట్రాక్ అండ్ ఫీల్డ్' 2024కు గాను బెస్ట్ జావెలిన్ త్రో అథ్లెట్‌గా నీరజ్ పేరును ఎంపిక చేసింది. ఇక నీరజ్‌కు ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించినందుకు క్రీడాభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికరగా అతడికి కంగ్రాజ్యూలేషన్స్ చెప్తున్నారు.
వరుసగా అతడు రెండో ఏడాది ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచి చరిత్రకెక్కాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ఈ 27 ఏళ్ల స్టార్ అథ్లెట్, ఈ మ్యాగజైన్ ప్రచురించిన ర్యాంకింగ్స్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా)ను వెనక్కినెట్టి అగ్రస్థానం దక్కించుకున్నాడు. 2023లోనూ అతనే మొదటి స్థానం సొంతం చేసుకున్నాడు. నిరుడు డైమండ్ లీగ్‌లో దోహా, లాసానె, బ్రసెల్స్ పోటీల్లో నీరజ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. పావో నూర్మి క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిచాడు.
"అగ్రస్థానం కోసం గత నంబర్‌వన్ నీరజ్, 2022 విజేత అండర్సన్ మధ్య తేడా స్పష్టంగా చెప్పలేం. డైమండ్ లీగ్‌లో నీరజ్ ఛాంపియన్‌గా నిలవలేదు. కానీ ఓవరాల్‌గా 3-2తో అండర్సన్‌ను వెనక్కినెట్టాడు. అండర్సన్ డైమండ్ లీగ్ మూడు అంచె పోటీల్లో విజేతగా నిలిచాడు. కానీ పారిస్ ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన కారణంగా నీరజ్ ముందున్నాడు. మరో టోర్నీలో మాత్రమే పోటీపడి నాలుగో స్థానంలో నిలిచిన ఒలింపిక్ పసిడి విజేతను ఏం చేస్తాం? అందుకే అర్షద్ నదీమ్ అయిదో స్థానం కంటే మెరుగైన ర్యాంకు సాధించలేకపోయాడు" అని మేగజైన్‌లో రాసుకొచ్చారు. పారిస్ ఒలింపిక్స్‌లో నదీమ్ పసిడి, అండర్సన్ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. నిరుడు ఒలింపిక్స్ కాకుండా నదీమ్ పారిస్ డైమండ్ లీగ్ అంచెలో మాత్రమే పోటీపడి నాలుగో స్థానంలో నిలిచాడు.