Neeraj Chopra Gold Medal :భారత్ స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒడిషా భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన జరిగిన 27వ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ లీగ్‌లో అతడు తన బల్లాన్ని 82.27 మీటర్ల దూరానికి విసిరి పసిడి పతకాన్ని ముద్దాడాడు.
ఫైనల్స్‌లో కర్ణాటకకు చెందిన మనును వెనక్కినెట్టి నీరజ్ గెలుపొందాడు. దీంతో మను 82.06 మీటర్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ పాటిల్ 78.39 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు.
అంతకుముందు భారత ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో పాల్గొన్న నీరజ్, కేవలం 2 సెంటీమీటర్ల తేడాతో అగ్రస్థానంలో నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో 88.36 మీటర్ల దూరానికి జావెలిన్ విసిరిన నీరజ్ రజతాన్ని సాధించాడు.
ఇక చెక్ రిపబ్లిక్ ప్లేయర్ జాకబ్ వాద్లెచ్ 88.38 మీటర్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్, ఆ తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో వరుసగా 84.93, 86.24, 86.18, 82.228 మీటర్ల దూరాన్ని నమోదు చేశాడు. దీంతో చివరి ప్రయత్నంగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శక్తినంతా కూడదీసుకున్నాడు.