Neeraj Chopra Coach :భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా - కోచ్ క్లాస్ బార్టోనిట్జ్ 5ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగియనుంది. జర్మనీకి చెందిన 75ఏళ్ల బార్టోనిట్జ్ తన కోచింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలుకన్నాడు. అతడు నీరజ్‌కు గత ఐదేళ్లుగా జావెలిన్ త్రోలో శిక్షణ ఇచ్చాడు. అయితే వయసు రీత్యా బార్టోనిట్జ్ ఇకపై కోచింగ్ ఇవ్వడం ఆపేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత అథ్లెట్స్ ఫెడరేషన్ తాజాగా పేర్కొంది.
'బార్టోనిట్జ్ వయసు 75 ఏళ్లు. ఈ వయసులో ఎక్కువగా అతడు జర్నీ చేయాలనుకోవడం లేదు. బార్టోనిట్జ్ ఇకపై తన ఫ్యామిలీకి సమయం కేటాయించాలనుకుంటున్నాడు' అని అథ్లెట్స్ ఫెడరేషన్ అధికారి ఒకరు చెప్పారు.
నీరజ్ చోప్రాకు 2019 నుంచి బార్టోనిట్జ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అయితే తొలుత బయోమెకానిక్స్ నిపుణుడుగా వచ్చిన బార్టోనిట్జ్, ఆ తర్వాత కోచ్‌గా నియామకమయ్యాడు. బార్టోనిట్జ్ ఆధ్వర్యంలో నీరజ్ చోప్రా తన కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, పారిస్ ఒలింపిక్స్‌లో రజతాన్ని సాధించాడు. అలాగే ప్రపంచ, డైమండ్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆసియా క్రీడల్లోనూ నీరజ్ గోల్డ్ దక్కించుకున్నాడు. బార్టోనిట్జ్ కోచింగ్‌లో నీరజ్ చోప్రా అద్భుతంగా రాణించాడు.