Mumbai Indians Playoff Chances: 2024 ఐపీఎల్‌లో ముంబయి వరుస పరాజయాలతో సతమతమవుతోంది. నూతన సారధి హార్దిక్ పాండ్య నేతృత్వంలో పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ప్రస్తత సీజన్లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ముంబయి ఏకంగా ఆరింట్లో ఓడి, కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి నుంచి ఈ ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. తాజాగా దిల్లీ క్యాపిటల్స్ చేతిలోనూ ఓడిన ముంబయి ప్లేఆఫ్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. దీంతో ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి 5సార్లు ఛాంపియన్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరాలంటే?
ముంబయిప్లే ఆఫ్‌కు చేరాలంటే
ముంబయి ఇండియన్స్ లీగ్ దశలో ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఒకసారి, కోల్‌కతా నైట్ రైడర్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం రాజస్థాన్, కోల్‌కతా, లఖ్‌నవూ, హైదరాబాద్ పాయింట్ల పట్టికలో టాప్ -4లో ఉన్నాయి. అంటే టాప్- 4లో ఉన్న మూడు జట్లతోనే ముంబయి తమ 5 మ్యాచ్‌లు ఆడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లన్నీ గెలిస్తే ముంబయి ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అదే ఈ ఐదింట్లో మ్యాచుల్లో ముంబయి ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.
ముంబయి ఒక మ్యాచులో ఓడిపోతే, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. మిగిలిన 5 మ్యాచ్‌ల్లో ముంబయి తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలోనే మూడు మ్యాచులు ఆడనుంది. ఇది వారికి కలిసొచ్చే అంశం. అయితే వాంఖడే స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. విధ్వంసకర బ్యాటర్లు ఉన్న కోల్‌కతా, లఖ్‌నవూ, సన్‌రైజర్స్ బ్యాటర్లను ముంబయి బౌలర్లు కట్టడి చేస్తారా? అన్నదే ఆసక్తికరంగా మారింది.