MS Dhoni CSK :ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చవి చూసింది. గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక వెనుతిరిగింది. మిచెల్ (63), మొయిన్ అలీ (56), పోరాడినప్పటికీ చెన్నై విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఆఖరిలో వచ్చిన ధోనీ మాత్రం తన ఇన్నింగ్స్‌తో అభిమానుల్లో జోష్ నింపాడు. మ్యాచ్ ఓడినప్పటికీ పలు గుర్తుండిపోయే రికార్డులను నమోదు చేశాడు. అవేంటంటే ?
మ్యాచ్ మొదటి నుంచి తడబడ్డ చెన్నై జట్టు తొలి 10 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సరిగ్గా అదే సమయంలో క్రీజులోకి వచ్చిన మిచెల్, మొయిన్ జట్టుకు మంచి స్కోర్ అందించారు. నాలుగో వికెట్ పడే సమయానికి 57 బంతుల్లో 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఆ తర్వాత చెన్నై జట్టుకు మళ్లీ కష్టాలు తప్పలేదు. వరుసగా వికెట్లు కోల్పోడం వల్ల ఇక ఓటమి ఖాయమైంది. అయితే ఆఖరిలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ తన ఇన్నింగ్స్‌లో 26 అజేయ పరుగులు చేశాడు. సిక్సర్లు బాది అందరినీ అలరించాడు.
ఇదంతా ఒక ఎత్తైతే ధోనీ ఒంటిచేత్తో సిక్సర్లు బాదటం మరో ఎత్తు. ఈ మ్యాచ్‌లో ధోనీ మూడు సిక్సర్లు బాదగా అందులో రెండింటినీ ఒంటి చేత్తోనే కొట్టాడు. ఇక మూడోసారి హెలికాఫ్టర్ షాట్‌తో బాదిన సిక్సర్ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపయ్యింది.