Mohammed Siraj vs Travis Head :అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టులో మహ్మద్ సిరాజ్ -ట్రావిస్ హెడ్ మధ్య నడిచిన మాటల యుద్ధాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అతడిపై సిరాజ్‌పై చర్యలు తీసుకుంటూ మ్యాచ్ ఫీజులో 20శాతం జరిమానాగా విధించినట్లు పేర్కొంది. తోటి క్రీడాకారుడి పట్ల మైదానంలో అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.5 ఆర్టికల్‌ను ఉల్లంఘించినందుకు ఈపెనాల్టీ విధించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు హెడ్‌పైనా కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు గాను ఈ ఇద్దరికీ ఒక్కో డీమెరిట్ పాయింట్‌ను జరిమానాగా విధించింది ఐసీసీ. అయితే ఈ ఇద్దరూ తమ తప్పులను అంగీకరించారని, మ్యాచ్ రిఫరీ ప్రతిపాదించిన చర్యలకు అంగీకారం తెలిపారంటూ ఆ ప్రకటనలో పేర్కొంది.
ఏమైందంటే?
ఆసీస్, భారత్ మధ్య జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ సమయంలో ట్రావిస్ హెడ్ - మహ్మద్ సిరాజ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. హెడ్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాక సిరాజ్ సంబరాలు చేసుకుంటూ బయటికి వెళ్లిపో అంటూ సైగలు చేశాడు. అయితే, హెడ్‌తో అతడు ప్రవర్తించిన తీరును మాజీలతో పాటు కొంతమంది అభిమానులు తప్పుబడుతున్నారు. ట్రావిస్ హెడ్‌తో సిరాజ్ అలా చేయకుండా ఉంటే బాగుండేదంటూ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా తాజాగా అభిప్రాయపడ్డారు. తాజాగా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సిరాజ్ వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.