Kl Rahul Ravindra Jadeja Injuries : భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ప్రధాన బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. గత 36 నెలల్లో వీరిద్దరూ 11 సార్లు గాయపడ్డారు. గత మూడు సంవత్సరాల్లో భారత్ తరఫున వాళ్లు ఆడిన మ్యాచ్‌ల కంటే దూరంగా ఉన్నవే ఎక్కువ.
రవీంద్ర జడేజాకు 2021లో రెండు సార్లు గాయాలయ్యాయి. అలానే 2022లోనూ రెండుసార్లు గాయాలతో జడేజా జట్టుకు దూరమయ్యాడు. కెరీర్లో ఎన్నడూ లేనంత విరామం ఆ రెండు సంవత్సరాల్లో వచ్చింది. తాజాగా తొడ కండరాల గాయంతో ఇంగ్లాండ్‌తో టెస్టు నుంచి వైదొలిగాడు. ఈసారి కూడా ఎక్కువ రోజులే ఆటకు దూరమయ్యేలా ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో జడేజా మళ్లీ కనిపించకపోవచ్చు.
మరోవైపు కేఎల్ రాహుల్‌ది కూడా అదే పరిస్థితి. 2021 జనవరిలో మణికట్టు గాయంతో, మే నెలలో అపెండిసైటిస్ వల్ల, నవంబరులో తొడకండరాల గాయంతో రాహుల్ బాధపడ్డాడు. 2022 జూన్‌లో అతడికి గజ్జల్లో, 2023 మే నెలలో ఐపీఎల్ ఆడుతుండగా తొడకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నాలుగు నెలలకు పైగా ఆటకు దూరమయ్యాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ సమయంలో తిరిగి ఫిట్‌నెస్ సాధించాడు. పునరాగమనంలో నిలకడగా ఆడుతున్న రాహుల్ ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా తొడ కండరాల గాయం మళ్లీ రావటం వల్ల రెండో టెస్టుకు దూరమయ్యాడు. మూడో టెస్టుకైనా రాహుల్ వస్తాడా, లేగా అన్నది సందేహంగానే ఉంది.