Jasprit Bumrah Record :పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ టాపార్డర్‌ను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలోనే ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (0)ను బుమ్రా తొలి బంతికే ఔట్ చేసి, అతడిని పెవిలియన్ పంపాడు. దీంతో బుమ్రా సౌతాఫ్రికా లెజెండరీ బౌలర్ డెల్ స్టెయిన్ రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో స్టీవ్ స్మిత్‌ను గోల్డెన్ (తొలి బంతికే ఔట్ అవ్వడం) డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు.
ఇప్పటివరకు డెల్ స్టెయిన్ మాత్రమే స్మిత్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు. గెబెర్హా వేదికగా 2014లో ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్‌లో స్మిత్ టెస్టుల్లో తొలిసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో అతడిని స్టెయిన్ పెవిలియన్‌కు పంపాడు. అప్పట్నుంచి స్మిత్ టెస్టుల్లో ఎప్పుడు కూడా ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ అవ్వలేదు. దాదాపు ఓ దశాబ్దం తర్వాత స్మిత్‌ను బుమ్రా గోల్డెన్ డకౌట్ చేసి కెరీర్‌లో అరుదైన ఘనత అందుకున్నాడు.
కాగా, స్మిత్ సుదీర్ఘమైన తన టెస్టు కెరీర్‌లో 196 ఇన్నింగ్స్‌ల్లో బరిలో దిగగా అందులో 11సార్లు మాత్రమే పరుగులు చేయకుండా (డకౌట్) ఔట్ అయ్యాడు. అందులో ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరడం (గోల్డెన్ డకౌట్) ఇది రెండోసారి మాత్రమే. ఇక స్వదేశంలో స్మిత్‌కు ఇది తొలి గోల్డెన్ డకౌట్.