Ishan Kishan BCCI : ఒకప్పుడు క్రికెటర్లందరూ ఇంటర్నేషనల్ మ్యాచులు లేకుంటే రంజీల్లో ఆడుతూ క్రికెట్ అభిమానులను అలరించేవారు. అయితే ఇప్పుడు కొందరు క్రికెటర్లు అలా చేయట్లేదు. రంజీలు ఆడేందుకు విముఖత చూపిస్తున్నారు. కేవలం అంతర్జాతీయ మ్యాచులు, ఐపీఎల్ మాత్రమే ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అలాంటి ప్లేయర్స్‌ను కంట్రోల్ చేసేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకుంది. భారత జట్టులో(పర్యటనలో) లేనివాళ్లు ఐపీఎల్లో ఆడాలంటే అంతకన్నా ముందు ప్లేయర్స్ అందరూ కచ్చితంగా రంజీ ట్రోఫీ మూడు, నాలుగు మ్యాచులు ఆడేలా బోర్డు ప్రణాళిక రచిస్తోంది.
అసలేం జరిగిందంటే ? గతేడాది డిసెంబర్ నుంచి ఇషాన్ కిషన్ ఆటకు దూరంగా ఉంటున్నాడన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లిన అతడు మానసిక సమస్యలు అంటూ స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. రీసెంట్గా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టులకు అతడిని సెలక్టర్లు తీసుకోలేదు. ఈ విషయమై కోచ్ ద్రవిడ్‌కు ప్రశ్న ఎదురైంది. టీమ్ఇండియాలోకి రావాలంటే ఎవరైనా సరే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని ద్రవిడ్ పేర్కొన్నాడు.