Irani Cup 2024 Winner :2024 ఇరానీ టైటిల్ ముంబయి దక్కించుకుంది. టోర్నీలో భాగంగా రెస్టాఫ్ ఇండియా- ముంబయి (Mumbai vs Rest of India) మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగుల ఆధిక్యం సంపాదించిన ముంబయి విజేతగా నిలిచింది. ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసింది. రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. డబుల్ సెంచరీతో అదరగొట్టిన ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఇరానీ కప్‌ను ముంబయి 15వ సారి కైవసం చేసుకోవడం విశేషం.
ఐదో రోజు ఓవర్‌నైట్ స్కోర్ 153- 6తో ఆట కొనసాగించిన ముంబయి, 329- 8తో నిలిచింది. ముంబయి రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో తనుష్ కొటియన్ (114* పరుగులు), పృథ్వీ షా (76 పరుగులు), మోహిత్(51* పరుగులు) చేశారు. తనుష్- మోహిత్ జోడీ తొమ్మిదో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే, మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడం వల్ల డ్రా గా ముగిస్తున్నట్లు ప్రకటించారు. రెండో ఇన్నింగ్స్‌లో రెస్టాఫ్ ఇండియా బౌలర్ సరాంశ్ జైన్ 6 వికెట్లు దక్కించుకున్నాడు.