IPL Franchise Meeting : ఐపీఎల్ సీజన్ ఎంతో అట్టహాసంగా జరుగుతున్న తరుణంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ భేటీ కానుంది. ఏప్రిల్ 16న అహ్మదాబాద్ వేదికగా ఈ మీటింగ్ జరగనుంది. తాజాగా ఈ విషయాన్ని బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీల ఓనర్లకు చెప్పింది. అయితే ఈ మీటింగ్‌కు బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ, సెక్రెటరీ జై షా, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ హాజరుకానున్నారు.
అయితే ఆటగాళ్ల రిటెన్షన్‌పై తాజాగా ఫ్రాంచైజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని జట్లు రిటైన్ ఆటగాళ్ల సంఖ్యను ఎనిమిదికి పెంచాలని కోరుతుండగా, మరికొన్నేమో దీనికి అంగీకరించడం లేదు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు జరిగిన చివరి మెగా వేలంలో ఒక్కో జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అంతే కాకుండా ఐపీఎల్ 2024 వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి జట్లకు రూ.100 కోట్ల పరిమితిని విధించారు. వచ్చే సీజన్ నుంచి దీనిని పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 ఎడిషన్‌కు ముందు నిర్వహించనున్న మెగా వేలం గురించి ఈ మీటింగ్‌లో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. వేలానికి ముందు ప్లేయర్ల రిటెన్షన్ అంశంపై కూడా ఈ వేదికగా చర్చలు జరిగే అవకాశం ఉంది.