IPL 2025 Sunrisers Hyderabad Full Team list :ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. ఆది, సోమవారాల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్, అంచనాలకు మించి సాగి ప్లేయర్లపై కోట్లాభిషేకం కురిపించింది. అయితే గత సీజన్‌లో ఫైనల్‌కు వరకు వచ్చి టైటిల్‌ను తృటిలో చేజార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్(Kavya Maran SRH) వేలంలో తనదైన మార్క్ చూపించిందని అంటున్నారు.
ఏడుగురు ఫారెన్ ప్లేయర్లతో పాటు 20 మంది నాణ్యమైన ప్లేయర్లతో జట్టును బలంగా తయారు చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. వేలంలో 15 మంది కొనుగోలు చేసింది. అయితే గత కొన్ని సీజన్లుగా తమ ఫ్రాంచైజీకీ మంచిగా సేవలందించిన భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌ను మాత్రం దక్కించుకోలేదు. వారి స్థానంలో మహ్మద్ షమి, హర్షల్ పటేల్‌ను సొంతం చేసుకుంది.
గత సీజన్‌లో ఫైనల్‌కు చేరడానికి ప్రధాన కారణమైన పవర్‌ఫుల్ బ్యాటింగ్ లైనప్‌ను మరోసారి కొనసాగించేలా, వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేసింది కావ్య మారన్. విధ్వంసక బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను దక్కించుకుంది సన్ రైజర్స్. గత సీజన్‌లో సరిగ్గా ప్రదర్శన చేయలేకపోయిన హిట్టర్ అబ్దుల్ సమద్ స్థానంలో యువ ఫినిషర్ అభినవ్ మనోహర్‌ను సొంతం చేసుకుంది. దీంతో బ్యాటింగ్ లైనప్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు ఇషాన్ కిషన్, అభినవ్ ఉండటం వల్ల బలంగా తయారైంది. వీరితో పాటు సచిన్ బేబీ, అంకిత్ వర్మ కూడా బ్యాటింగ్ లైనప్‌కు తోడయ్యారు.
అలానే అనుభవం ఉన్న స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను ఎస్ఆర్హెచ్ దక్కించుకుంది. లెగ్ స్పిన్నర్లపై కూడా ఎక్కువగా దృష్టి సారించింది. రాహుల్ చాహర్, ఆడమ్ జంపాను కొనుగోలు చేసింది. ఇంకా ఐపీఎల్‌లో ఇప్పటివరకు అరంగేట్రం చేయని నాణ్యమైన విదేశీ ప్లేయర్స్ కమిందు మెండిస్, బ్రైడన్ కార్సే , ఎషన్ మలింగను తక్కువ ధరకే దక్కించుకుని బ్యాకప్ ప్లేయర్లతో జట్టును మరింత పటిష్టంగా మార్చుకుంది.
అది బాధాకరం - జట్టు కూర్పుపై కోచ్ వెటోరి స్పందించారు. ఇషాన్ లాంటి ప్లేయర్‌ను జట్టులోకి తీసుకోవడం గొప్ప విజయం అని అన్నారు వెటోరి. అయితే భువనేశ్వర్, నటరాజన్ వంటి ఆటగాళ్లను విడిచిపెట్టడం బాధకరమని పేర్కొన్నారు. నటరాజన్ జట్టుకు ఎంత విలువైన ఆటగాడని వెల్లడించారు.