IPL 2025 Match Fee:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడే ప్లేయర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై లీగ్ మ్యాచ్ ఫీజులు పెంచుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. 2025 ఐపీఎల్ నుంచి లీగ్‌లో ఆడే ఒక్కో మ్యాచ్‌కు ప్లేయర్లు రూ. 7.5 లక్షలు ఫీజుగా అందుకోనున్నారు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్ చేశారు.
'ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు పెంచుతున్నామని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా క్రికెటర్లు ఇప్పటి నుంచి ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షల ఫీజు అందుకోనున్నారు. కాంట్రాక్ట్ డబ్బుతో అదనంగా, సీజన్లో అన్ని మ్యాచ్‌లు ఆడినట్లైతే ఒక్కో ప్లేయర్‌కు అత్యధికంగా రూ. 1.05 లక్షలు ఫీజు రూపంలో అందుతుంది. ఇందుకోసం అన్ని ఫ్రాంచైజీలు రూ. 12.60 కోట్లు మ్యాచ్ ఫీజుల కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. ఐపీఎల్‌కు, ప్లేయర్లకు ఇది కొత్త శకం' అని జై షా ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా, గతంలో ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ. 2 - 4 లక్షల మధ్యలో ఉండేది.
IPL 2025 Retention Rules :ఇక ఐపీఎల్ మెగా వేలం, రిటెన్షన్ రూల్స్‌పై రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక్కో జట్టు ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునేలా, ఒక రైట్ టు మ్యాచ్ కార్డు కూడా బీసీసీఐ అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ఎలాంటి షరతులు లేకుండా స్వదేశీ, విదేశీ ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు ఫ్రాంచైజీలకు వీలు కల్పించనుందని సమాచారం. ఈ మేరకు తాజాగా జరిగిన బీసీసీఐ జనరల్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.