IPL 2024 Westindies Cricketers : ఐపీఎల్ - ఈ మెగాటోర్నీ పేరు వినగానే చాలా మంది క్రికెట్ ప్రియులకు వెస్టిండీస్ ప్లేయర్సే గుర్తొస్తారు. ఎందుకంటే గత 16 సీజన్లలో కరీబియన్ ప్లేయర్స్ చేసిన విన్యాసాలు అలాంటివి. ఒకప్పుడు క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో లాంటి వాళ్లు ఈ ఐపీఎల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే ఇప్పుడు వారి అంచనాలను కొనసాగిస్తూ ఐపీఎల్-17లోనూ విండీస్ ప్లేయర్లు మెరుపులు మెరిపిస్తున్నారు. మరి ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, రొమారియో షెఫర్డ్, నికోలస్ పూరన్ లాంటి క్రికెటర్లు ఎలాంటి ప్రదర్శన చేశారు? తమ జట్ల విజయాల్లో ఎలాంటి పాత్ర పోషించారో తెలుసుకుందాం.
కోల్‌కతాలో ఇద్దరు - ఈ ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ హ్యాట్రిక్ విజయాలు సాధించడంలో ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్‌ది కీలక పాత్ర. రసెల్ సన్‌రైజర్స్‌పై 25 బంతుల్లోనే 64 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు కూడా తీసి జట్టును గెలిపించాడు. దిల్లీ క్యాపిటల్స్‌పై 19 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. తద్వారా కోల్‌కతా భారీ స్కోరు అందుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు. చివర్లో అతడు దూకుడు ప్రదర్శన వల్లే ఐపీఎల్ హిస్టరీలోనే రెండో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా కేకేఆర్ నిలిచింది.
ఇక సునీల్ నరైన్ కూడా కోల్‌కతా విజయాలకు తోడుగా ఉంటున్నాడు. గతంలో బౌలర్‌గా సత్తాచాటిన అతడు ఈ సారి బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. బెంగళూరుపై 47, దిల్లీపై 85 పరుగులతో జట్టులో విజయంలో కీలకంగా వ్యవహరించాడు. స్పిన్ అయినా పేస్ అయినా మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడుతున్నాడు. ఇక బంతితోనూ మాయ చేస్తూ ఆ మ్యాచుల్లో ఓక్కో వికెట్ తీశాడు.
అటు షెఫర్డ్ ఇటు పూరన్ - ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పేస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ దిల్లీ క్యాపిటల్స్‌పై అదరగొట్టాడు. 6 బంతుల్లోనే 32 పరుగులు చేసి ముంబయి భారీ స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. బౌలింగ్‌లోనూ ఓ వికెట్ తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.