IPL 2024 Second Phase Matches Venue : సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ లీగ్ రెండో విడత మ్యాచ్లను యూఏఈలో నిర్వహించనున్నారన్న వార్తలపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. అందులో నిజం లేదంటూ తోసిపుచ్చారు. వేదికలో ఎటువంటి మార్పులు లేదని త్వరలోనే మిగతా షెడ్యూల్ను కూడా విడుదల చేస్తామని తెలిపారు. అయితే గతంలోనూ బీసీసీఐ 2009, 2014 ఎన్నికల సమయంలో టోర్నీని సౌతాఫ్రితా, దుబాయ్లో నిర్వహించింది. కానీ, 2019లో మాత్రం పూర్తి టోర్నీనీ విజయవంతంగా భారత్‌లోనే నిర్వహించింది.
మరోవైపు ఇదే విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా స్పందించారు. రెండో దశ మ్యాచ్‌లు కూడా భారత్‌లోనే జరగనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. "ఈ ఏడాది సీజన్ మొత్తం ఇండియాలోనే జరగనుంది. విదేశాల్లో నిర్వహించే ఆలోచన లేదు" అంటూ ఆయన పేర్కొన్నారు.
ఇక ఇప్పటికే తొలి షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి ఈ ప్రతిష్టాత్మక లీగ్ ప్రారంభం కానుంది. అప్పటి నుంచి ఏప్రిల్ 7వరకు ఐపీఎల్ 17న సీజన్ తొలి విడత టోర్నీ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఇందులో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి.