IPL 2024 RR VS SRH Bhuvaneshwar Kumar :ఐపీఎల్-2024లో భాగంగా తాజాగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు సరైన మజాను పంచింది. ఇంకా చెప్పాలంటే ఉత్కంఠగా ఎన్నో మలుపులు తిరుగుతూ థ్రిల్లర్ సినిమాను తలపించింది. అలా ఆఖరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన పోరులో సన్‌రైజర్స్ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని ఎగరేసుకుపోయింది.
ఆఖరి ఓవర్‌లో అద్భుతం - ఈ విజయంలో భువనేశ్వర్ కుమార్ కీలకంగా వ్యవహరించాడు. చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ వేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. వాస్తవానికి రాజస్థాన్ విజయం అంతా ఖాయమనుకున్నారు. ఆఖరి ఓవర్‌లో ఆ జట్టుకు 13 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో రావ్‌మెన్ పావెల్, అశ్విన్ ఉన్నారు. ఈ సమయంలో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కమ్మిన్స్ నుంచి భువీ అందుకున్నాడు. అప్పుడు లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కు అశ్విన్ సింగిల్ తీసి పావెల్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఇక పావెల్ రెండో బాల్‌కు డబుల్, మూడో బంతిని బౌండరీ తరలించాడు. దీంతో చివరి మూడు బంతుల్లో రాజస్థాన్ విజయ సమీకరణం 6 పరుగులుగా మారింది. అనంతరం వరుసగా రెండు బంతుల్లో పావెల్ రెండేసి పరుగులు తీసి విజయాన్ని తమ జట్టు ముంగిటకు తీసుకొచ్చాడు. ఇక ఆఖరి బంతికి రాజస్థాన్ విజయానికి 2 పరుగులే అవసరమయ్యాయి.
ఉత్కంఠ తారాస్థాయికి - అప్పుడు అభిమానుల్లో ఉత్కంఠ తారా స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో భువనేశ్వర్ ఆఖరి బంతిని అద్బుతంగా సంధించి పావెల్‌ను ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. దీంతో సన్‌రైజర్స్‌లో సంబరాలు మొదలైపోయాయి. అలా భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లతో చెలరేగి విజయంలో కీలకంగా వ్యవహరించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. మిగతా బౌలర్లలో నటరాజన్, కమ్మిన్స్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. దీంతో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(67), రియాన్ పరాగ్(77) అర్ధ శతకాలతో పోరాడిన ఫలితం దక్కలేదు.