IPL 2024 RCB VS KKR Sunil Narine :ఐపీఎల్‌లో బెంగళూరుపై విజయంలో కీలక పాత్ర పోషించిన కోల్‌కత్తా బ్యాటర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌తో నరైన్ టీ20ల్లో 500 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ప్రపంచ క్రికెట్‌లో కేవలం ముగ్గురు మాత్రమే నరైన్‌కు ముందు 500 మ్యాచ్‌ల మైలురాయిని దాటారు. విధ్వంసకర బ్యాటర్ కీరన్ పోలార్డ్ అందరికంటే ఎక్కువగా 660 టీ20 మ్యాచ్‌లు ఆడగా డ్వేన్ బ్రావో 573, షోయబ్ మాలిక్ 542 మ్యాచ్‌లు ఆడారు. టీ20ల్లో ఇప్పటివరకూ 500 మ్యాచ్‌లు ఆడిన నరైన్ 537 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గానూ నిలిచాడు. బ్యాటింగ్‌లో 3783 పరుగులు చేశాడు. 2011లో టీ20 ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నరైన్ టీ20ల్లో అత్యధిక మెయిడిన్లు 30 వేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. పవర్ ప్లేల్లో నాలుగో అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్ కలిగిన బ్యాటర్‌గానూ నిలిచాడు.
మరో 500 ఆడుతా : టీ20ల్లో 500 మ్యాచ్‌ల అద్భుత మైలురాయి అందుకోవడం ఆనందంగా ఉందని మ్యాచ్ అనంతరం నరైన్ వ్యాఖ్యానించాడు. తప్పకుండా మరో 500 మ్యాచ్‌లు ఆడతానన్న నమ్మకం తనకుందన్నాడు. తనపై తనకున్న విశ్వాసం అలాంటిదని చెప్పాడు. చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడటం రిలీఫ్‌గా అనిపించిందని, జట్టులోని సహచరులతోపాటు సహాయక సిబ్బంది ప్రోత్సాహం మరువలేనిదని నరైన్ అన్నాడు. ఇప్పటికీ కఠినంగా శ్రమిస్తుంటానని, మంచి శుభారాంభాన్ని కొనసాగించడం సులువైన విషయం కాదన్నాడు. మ్యాచ్ గెలిచినప్పుడు అందులో మన భాగస్వామ్యం ఉంటే ఆ అనుభూతి బాగుంటుందని, జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికీ పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఉంటుందని నరైన్ చెప్పుకొచ్చాడు. కాగా, ఓపెనర్‌గా వచ్చిన నరైన్ 47 పరుగులు చేశాడు. అంతకుముందు బౌలింగ్‌లో ఒక వికెట్ పడగొట్టడంతో నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తరపున వంద ఐపీల్ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆండ్రీ రస్సెల్ రికార్డ్ సృష్హించాడు. 114 మ్యాచ్‌ల్లో, రస్సెల్ 100 వికెట్లు పడగొట్టాడు. రస్సెల్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 5/15. సునీల్ నరైన్ తర్వాత కోల్‌కతా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రస్సెల్ నిలిచాడు.