IPL 2024 Virat Kohlis Statue : విరాట్ కోహ్లీ అంటే స్టార్ బ్యాటర్. ఎలాంటి బౌలర్‌పై అయినా తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆధిపత్యం చెలాయించగల ఆటగాడు. లెక్కలేనన్ని రికార్డులను నెలకొల్పి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. తన ఆటతో యూత్ స్పోర్ట్స్ ఐకాన్‌గా మారిన కోహ్లీ తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు.
ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నహర్‌ఘర్ జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మైనపు విగ్రహానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జైపూర్ వ్యాక్స్ మ్యూజియం వ్యవస్థాపకులు, డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ - "గత కొంతకాలం నుంచి పర్యాటకులు, ముఖ్యంగా పిల్లలు, యువత నుంచి విరాట్ కోహ్లీ విగ్రహాన్ని తయారు చేయాలనే డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అతనే అందరి ఫేవరెట్. కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్న ఈ తరుణంలో అతని మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించే నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటికే మా మ్యూజియంలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీల విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన మరో స్టార్ ఆటగాడి మైనపు విగ్రహం చేరనుంది" అని తెలిపారు.
కాగా, ఈ మ్యూజియంలో ఇప్పటికే మహాత్మా గాంధీ, దలైలామా, రవీంద్రనాథ్ ఠాగూర్, అమితాబ్ బచ్చన్, భగత్ సింగ్, కల్పనా చావ్లా, జాకీ చాన్, దీపికా పదుకొనే, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, లియోనెల్ మెస్సీ మొదలగు 44మంది ప్రముఖుల విగ్రహాలు కూడా ఉన్నాయి.