IPL 2024 Punjab Kings VS RCB :ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ దంచేశాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. అలానే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధికంగా 100 సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన తొలి టీమ్ ఇండియా క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన లిస్ట్‌లో కోహ్లీ మూడో స్ధానంలో నిలిచాడు. తొలి స్ధానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(110) ఉండగా, ఆ తర్వాతి స్ధానంలో డేవిడ్ వార్నర్ (109) కొనసాగుతున్నాడు.
అలానే ఈ మ్యాచ్‌తోనే అత్యధిక క్యాచ్‌లు(173) అందుకున్న టీమ్ ఇండియా ప్లేయర్‌గానూ అవతరించాడు. బెయిర్ స్టో బాదిన క్యాచ్‌ను అందుకోవడంతో ఈ మార్క్ అందుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో విరాట్ మరో క్యాచును కూడా పట్టుకున్నాడు అంతకుముందు ఈ రికార్డ్ టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా పేరిట ఉండేది. టీ20 క్రికెట్‌లో అతడు 172 క్యాచ్‌లు పట్టుకున్నాడు. అయితే ఇప్పుడు తాజా మ్యాచ్‌తో రైనా ఆల్‌టైమ్ రికార్డును విరాట్ బ్రేక్ చేసేశాడు. ఇక రైనా తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(167) ఉన్నాడు.
కోహ్లీ కాళ్లు మొక్కిన ఫ్యాన్ :ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన కూడా చోటు చేసుకుంది. బెంగళూరు బ్యాటింగ్ సమయంలో ఓ అభిమాని సెక్యూరిటీ, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి వచ్చాడు. నేరుగా బ్యాటింగ్ చేస్తున్న విరాట్ దగ్గరకు వెళ్లి కాళ్లకు మొక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కోహ్లీ సదరు అభిమానిని పైకి లేపి బయటకు వెళ్లాలని సూచించాడు.