IPL 2024 Punjab kings strengthness and Weakness : ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్) మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో ప్లేయర్స్ అంతా తమ ఫ్రాంచైజీ కాంపౌండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ సెషన్‌ను మొదలుపెట్టేశారు. మొత్తం పది జట్లు బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ పదిలో ఐపీఎల్ ప్రారంభం సీజన్ నుంచి ఉన్న ఆ జట్టు మాత్రం చాలా తక్కువ సార్లు ప్లేఆఫ్స్ చేరింది. ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేదు. ప్రతిసారి సీజన్‌కు ముందు మాత్రం బెస్ట్ ప్లేయర్స్‌తోనే బరిలోకి దిగుతుంది. కానీ చివరకు మాత్రం ఉసూరుమనిపిస్తుంది. అదే పంజాబ్ కింగ్స్. మరి 17వ సీజన్‌లో అయినా ఆ జట్టు ట్రోఫీని అందుకుంటుందో లేదో తెలీదు కానీ పట్టుదలతో మాత్రం బరిలోకి దిగుతోంది. ఈ సందర్భంగా ఈ జట్టు బలాబలాలపై ఓ లుక్కేద్దాం.
ఇప్పటివరకు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు రెండు సార్లు మాత్రమే అర్హత సాధించింది. 2008లో సెమీస్, 2014లో ఫైనల్ చేరింది. మిగతా 14 సీజన్లలో ఒక్కసారి కూడా లీగ్ దశ దాటలేదు. గత సీజన్‌లో అయితే ఎనిమిదో స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌ల్లో 6 గెలిచి, 8 మ్యాచుల్లో పరాజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ కొత్త సీజన్ కోసం వేలంలో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ నెల 23న దిల్లీ క్యాపిటల్స్‌తో తమ మొదటి మ్యాచ్‌లో తలపడనుంది.
టీమ్ బలాల విషయానికొస్తే ఐపీఎల్‌లో ఇతర ఏ జట్టుకు లేని బలమైన పేస్ విభాగం పంజాబ్ జట్టుకు ఉండటం విశేషం. ఇప్పటికే టీమ్‌లో కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కరన్, నేథన్ ఎలిస్ ఉండగా వేలంలో హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్‌ను తీసుకుంది. హర్షల్ కోసమైతే ఏకంగా రూ.11.75 కోట్లు వెచ్చించింది. వోక్స్‌ను రూ.4.2 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఇద్దరు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఆడగలరు.
కెప్టెన్ ధావన్, లివింగ్‌స్టోన్, బెయిర్‌స్టో, జితేశ్ శర్మలతో బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది. గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన బెయిర్‌స్టో తిరిగొచ్చాడు. ఇది కలిసి రావొచ్చు. గత సీజన్‌లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ధావన్ (373) మరోసారి అదరగొట్టేందుకు రెడీగా ఉన్నాడు. లివింగ్‌స్టోన్ ఒంటిచేత్తో రాణించగలిగే సత్తా ఉంది. జితేశ్ శర్మ గత సీజన్‌లో రాణించి టీమ్‌ఇండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. రూ.8 కోట్ల దక్షిణాఫ్రికా టీ20 స్పెషలిస్టు బ్యాటర్ రొసో రాకతో బ్యాటింగ్ మరింత బలంగా తయారైంది. కరన్, లివింగ్‌స్టోన్, వోక్స్, సికందర్ రజా, హర్షల్ రూపంలో బలమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు.