IPL 2024 Hybrid Pitch Dharmasala Stadium : ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇప్పటికే కొత్త రూల్స్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో ప్రయోగానికి రెడీ అయిపోయారు. హిమచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల (Dharamshala) స్టేడియం వేదికగా జరిగే రెండు ఐపీఎల్ మ్యాచుల కోసం హైబ్రిడ్ పిచ్‌లను వినియోగించనున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో 200పైన స్కోర్లు తరచుగా నమోదు అవుతున్నాయి. 200+ లక్ష్యం కూడా నిలవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించేలా హైబ్రిడ్ పిచ్‌లను తీసుకురానున్నారు. అలా ఈ రెండు మ్యాచ్‌ల్లో వచ్చే రిజల్ట్స్ ఆధారంగా తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి ట్రాక్‌లను వాడాలా వద్దా అనేది నిర్ణయించనున్నారు.
ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌లు - ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్‌లు ఎక్కువ శాతం ఏకపక్షంగా సాగుతున్నాయి. బ్యాటర్లే బాదేస్తున్నారు తప్ప బౌలర్ల విజృంభణ తక్కువే కనిపిస్తోంది. ఏదో రెండు బౌన్సర్ల రూల్ తప్ప వారికి ఇంకేమీ సహకరించేలా కనిపించట్లేదు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 51 మ్యాచ్‌లు జరగగా 30 ఇన్నింగ్స్‌ల్లో 200+ స్కోర్లు, 12 సార్లు 190-200 మధ్య రికార్డ్ స్కోర్లు నమోదయ్యాయి. సన్‌రైజర్స్ అయితే ఏకంగా రెండుసార్లు ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసేసింది. అది కూడా నాలుగు మ్యాచుల వ్యవధిలో. దీని బట్టి బంతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆర్మెంజ్ ఆర్మీ 287 పరుగుల స్కోర్ చేస్తే బెంగళూరు ఆ కొండంత లక్ష్యాన్ని దాదాపుగా ఛేదించినంత(262) దగ్గరగా వెళ్లింది. కోల్‌కతా 223 పరుగులు చేస్తే రాజస్థాన్ ఆఖరి బంతికి ఆ లక్ష్యాన్ని ఛేదించేసింది. మరిన్ని మ్యాచుల్లో ఇలాంటి స్కోర్లే నమోదయ్యాయి. ఈ భారీ స్కోర్ల పోరులన్నింటిలో బౌలర్లు దారుణంగా తేలిపోయారనే చెప్పాలి. వీటిన్నింటికీ కారణం పిచ్ నుంచి సహకారం ఏమాత్రం వారికి లేకపోవడమే. అందుకే ఒక్క మంచి బంతిని కూడా వారు సంధించలేకపోయారు.
సిస్‌గ్రాస్ హై బ్రిడ్ పిచ్‌ల సాయంతో -బాల్‌కు, బ్యాటుకు మధ్య సమతూకం ఉంటే మ్యాచ్ మజా వస్తుంది. ఇందుకోసం సిస్‌గ్రాస్ సంస్థ హైబ్రిడ్ పిచ్ (Hybrid Pitch)లను తయారు చేస్తోంది. అవి మంచి రిజల్ట్స్‌ను చూపిస్తున్నాయి. ఈ ట్రాక్‌లలో సహజసిద్ధమైన గడ్డిని అమరుస్తున్నారు. వీటితో పాటు ఐదుశాతం పాలిమర్ కూడా కలిసి ఉంటుంది. దీంతో పిచ్‌లు చాలా సేపు పాటు తాజాగా ఉంటాయి. బౌలర్లు సమర్థవంతంగా బంతులు సంధించవచ్చు. స్థిరంగా బౌన్స్ రాబట్టొచ్చు. ఇప్పటికే యూనివర్సల్ యంత్రం సాయంతో ధర్మశాల స్టేడియంలో ఈ హైబ్రిడ్ ట్రాక్ పనులను ప్రారంభించేశారు కూడా. ధర్మశాల స్టేడియాన్ని రెండో హోం గ్రౌండ్‌గా పంజాబ్ కింగ్స్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు మే 5న సీఎస్కేతో, మే 9న ఆర్సీబీతో ఈ హైబ్రిడ్ పిచ్‌లపై ఆడనుంది.