ఆర్మీ అయినా, ఒలింపిక్స్ అయినా భారత్ కోసమే- బ్రాంజ్ మెడలిస్ట్ సెమా స్టోరీ ఇదే! - Paris Paralympics 2024 - PARIS PARALYMPICS 2024
Paralympics India 2024: పారిస్ పారాలింపిక్స్‌లో పురుషుల షాట్‌పుట్‌లో భారత అథ్లెట్ హొకాటో హొటోజి సెమా కాంస్యంతో మెరిశాడు. అద్భుత ప్రదర్శనతో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న సెమా జీవితం ఎంతోమందికి స్ఫూర్తి. మరి ఈ సెమా కథేంటంటే?
Paralympics India 2024:పారిస్ పారాలింపిక్స్ 2024లో హొకాటో హొటోజి సెమా కాంస్యంతో మెరిశాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన పోరులో సెమా అదరగొట్టాడు. F-57 విభాగంలో గుండును ఉత్తమంగా 14.65 మీటర్లు విసిరిన సెమా, మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నాడు. అయితే ఉగ్రమూకల నుంచి మాతృభూమిని రక్షించుకునే క్రమంలో ఓ కాలును కోల్పోయిన సెమా స్టోరీ ఏంటో చూద్దాం.
నాగాలాండ్‌లోని దిమాపుర్కు చెందిన ఓ సాధారణ రైతు కుటుంబలో సెమా జన్మించాడు. నలుగురు పిల్లల్లో రెండోవాడైన సెమాకు చిన్నప్పటినుంచే దేశ సేవ చేయాలని, ప్రత్యేక దళాల్లో చేరాలని కల. అందుకోసం మానసికంగా, శారీరకంగా ఎంతో శ్రమించాడు. సైన్యంలో చేరి హవల్దార్‌గా విధులు చేపట్టాడు. కానీ, 2002లో అతడి జీవితం అనుకోని మలుపు తిరిగింది.
అదే ఏడాది అక్టోబరు 14న నియంత్రణరేఖ వద్ద ఉగ్ర చొరబాట్లను అడ్డుకునే యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో సెమా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు అమర్చిన ఓ ల్యాండ్‌మైన్ పేలడం వల్ల సెమా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ పేలుడు కారణంగా తన ఎడమ మోకాలి నుంచి కింది భాగాన్ని పోగొట్టుకున్నాడు. దీంతో ప్రత్యేక దళాల్లో చేరాలన్న అతడి కల చెదిరిపోయింది.
అదే టర్నింగ్ పాయింట్ అయినప్పటికీ సెమా కుంగిపోలేదు. 2016లో క్రీడలవైపు దృష్టి మళ్లించాడు. సీనియర్ ఆర్మీ అధికారుల ప్రోత్సాహంతో షాట్‌పుట్‌లో శిక్షణ ప్రారంభించాడు. అదే సంవత్సరం జైపుర్‌లో జరిగిన పారా ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. ఇక 2022 లో మొరాకో గ్రాండ్ ప్రీలో రజతం దక్కించుకున్నాడు. ఆ తర్వాత 2023లో జరిగిన ఏషియన్ పారా గేమ్స్‌లో కాంస్యంతో మెరిశాడు. తాజాగా పారాలింపిక్స్‌లో కాంస్యంతో అదరగొట్టాడు. కాగా, ఈ విశ్వక్రీడల్లో నాగాలాండ్ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఒకే ఒక్క అథ్లెట్ సెమానే.