IND VS New Zealand Kohli Gambhir : టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. కోహ్లీ పరుగుల దాహంతో ఉన్నాడని, త్వరలో న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కోహ్లీ ప్రపంచ స్థాయి క్రికెటర్ అని, చాలా కాలంపాటు అద్భుతమైన ప్రదర్శన చేశాడని కొనియాడాడు. ప్రతి మ్యాచ్‌కు కోహ్లీ ఫామ్‌ను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో విరాట్ వరుస టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ విఫలం అవ్వడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు.
"విరాట్ గురించి నా ఆలోచనలు ఎప్పుడూ చాలా స్పష్టంగా ఉంటాయి. కోహ్లీ ప్రపంచ స్థాయి క్రికెటర్. కొన్నేళ్ల పాటు ఆయన టీమ్ ఇండియా తరఫున అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం విరాట్‌లో, అరంగేట్రం చేసినప్పుడు ఉన్న పరుగులు దాహం ఉంది. ఈ ఆకలే అతన్ని వరల్డ్ క్లాస్ ప్లేయర్‌ను చేసింది. శ్రీలంకతో మ్యాచులో కోహ్లీ అరంగేట్రం చేసినప్పుడు అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు గుర్తుంది. అతడిలో పరుగుల దాహం ఎప్పటికీ ఉంటుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో కోహ్లీ కచ్చితంగా సత్తా చాటుతాడు. అదే జోరును ఆస్ట్రేలియా సిరీస్ లోనూ కొనసాగిస్తాడని భావిస్తున్నాను. ఒక మ్యాచ్ లేదా సిరీస్ ఆధారంగా ఆటగాడిని అంచనా వేయకూడదు. క్రీడల్లో ఆటగాళ్లు కొన్నిసార్లు విఫలమవుతుంటారు."
-గౌతమ్ గంభీర్, టీమ్ ఇండియా హెచ్ కోచ్