India Vs Bangladesh 1st Test : తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు 234 పరుగులకు ఆలౌటై వెనుతిరిగింది. దీంతో భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది. ఇక బంగ్లా కెప్టెన్ షాంటో (82) హాఫ్ సెంచరీ సాధించగా, టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా 3, బుమ్రా 1 వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమ్ఇండియా ఆల్‌రౌండ్‌ర్లు అశ్విన్, జడేజా చెలరేగి ఆడటం వల్ల 376 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత పేసర్లు ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. తర్వాత శుభమన్ గిల్, పంత్‌లు సెంచరీలతో కదంతొక్కడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 287 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రెండు టెస్టుల సిరీస్‌లో రోహిత్ సేన 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది.
ఆరంభంలో కొంచెం వెనుకంజ వేసినట్లు కనిపించిన టీమ్‌ఇండియా అద్భుతంగా పుంజుకొని కేవలం మూడున్నర రోజుల్లోనే టెస్టు మ్యాచ్‌ను ముగించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ భారత స్పిన్నర్లు ధాటికి 234 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన బంగ్లాదేశ్ మరో 76 పరుగులు జోడించి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు ఆట ఆరంభంలో బంగ్లాదేశ్ పతనాన్ని షకిబ్ అల్ హసన్‌తో కలిసి కెప్టెన్ షాంటో కాసేపు అడ్డుకోగలిగాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అశ్విన్ రాకతో బంగ్లాదేశ్ పని అయిపోయింది. సెంచరీతో బంగ్లాను దెబ్బతీసిన అశ్విన్ బంతితోనూ చుక్కులు చూపించాడు.