Neeraj Chopra Paris Olympics:పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాపై భారత అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. విశ్వ క్రీడల్లో నీరజ్ మరో స్వర్ణాన్ని ముద్దాడడం పక్కా అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా- అమెరికాకు చెందిన ఓ వీసా స్టార్టప్ కంపెనీ సీఈవో బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఒలింపిక్స్‌లో నీరజ్ పసిడి పతకం నెగ్గితే ప్రపంచంలో ఏ దైశానికైనా వెళ్లేందుకు ఫ్రీ వీసా ఇప్పిస్తానన్నారు.
'పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధిస్తే ఫ్రీ వీసా ఇప్పిస్తా లెట్స్ గో' అని అట్లీస్ అనే కంపెనీ సీఈవో మోహక్ నేత్ర ఆన్లైన్ జాబ్ సెర్చింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డిన్ (Linkedin)లో రీసెంట్గా పోస్ట్ చేశారు. అయితే ఈ ఆఫర్ ప్రాసెస్ ఏంటో చెప్పాలంటూ లింక్డిన్ యూజర్లు ఈ పోస్ట్‌ను తెగ వైరల్ చేశారు. దీనికి స్పందించిన మోహక్ నేత్ర ఆఫర్ ప్రొసిజర్ను వివరంగా చెప్తూ మరో పోస్ట్ చేశారు.
'నీరజ్ గోల్డ్ మెడల్ సాధిస్తే అందరికీ ఫ్రీ వీసా ఇస్తానని నేను జులై 30న నేను ప్రామిస్ చేశాను. అయితే ఆగస్టు 8న జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. ఇందులో నీరజ్ పసిడి పతకం నెగ్గితే, కచ్చితంగా యూజర్లందరికీ మా కంపెనీ తరఫున ఒక్క రోజు ఫ్రీ వీసా ఇప్పిస్తాం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లాలనుకున్నా సరే వీసా ఖర్చు మాదే. మీ ఈమెయిల్ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. వీసా పొందేందుకు వీలుగా మీకు ఓ అకౌంట్ క్రియేట్ చేస్తాం' అని మోహక్ మరో పోస్ట్‌లో క్లారిటీ ఇచ్చారు.