2025 WTC Final India Chances :భారత్ - బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. తొలి రోజు దాదాపు 55 ఓవర్ల ఆట రద్దవగా, రెండో రోజు ఒక్క ఒక్క బంతి పడకుండానే ఆట తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 107-3 స్కోర్‌తో ఉంది. ఇక టెస్టులో మిగిలింది మూడు రోజులే. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినట్లయితే ఈ సిరీస్‌ను టీమ్ఇండియా 1-0తో కైవసం చేసుకుంటుంది. కానీ, ఈ మ్యాచ్ రద్దైనా, డ్రాగా ముగిసినా భారత్‌కు 2025 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారనున్నాయి. మరి టీమ్ఇండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్స్‌లు ఎలా ఉన్నాయి? తర్వాత భారత్ ఎన్ని మ్యాచ్‌లు నెగ్గాలి? ఇప్పుడు చూద్దాం.
2023- 25 డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో ఏడింట్లో నెగ్గి, 2 టెస్టుల్లో ఓడింది. మరోకటి డ్రా చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ 71.67 శాతం (86 పాయింట్లు) తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆస్ట్రేలియా 12మ్యాచ్‌ల్లో 8 విజయాలు నమోదు చేసి 62.50 శాతం (90 పాయింట్లు)తో రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుత బంగ్లా సిరీస్ తర్వాత 2025 డబ్ల్యూటీసీలో భారత్ ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో 3 మ్యాచ్‌లు న్యూజిలాండ్‌తో, 5 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే బంగ్లా సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకున్నట్లైతే, మిగిలిన 8 టెస్టుల్లో భారత్ కనీసం 3 మ్యాచ్‌లు నెగ్గినా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.