Ind Vs Zim 1st T20 2024:యంగ్ టీమ్ఇండియా, జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు రెడీ అయ్యింది. శనివారం (జులై 6)టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో యువ భారత్ 5టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ జట్టును యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ నడిపించనున్నాడు. గిల్‌తోపాటు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రింకు సింగ్, జితేశ్ శర్మ సిద్ధమయ్యారు. జింబాబ్వేపై వీరి ప్రదర్శన ఎలా ఉండనుందో ఆసక్తిగా మారింది.
ఛాన్స్ అందిపుచ్చుకుంటారా?టీమ్ఇండియాకు టీ20 రెగ్యులర్ కెప్టెన్ రేస్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ముందున్నాడు. అయితే గిల్ ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా తనదైన ముద్ర వేస్తే, సారథిగా ఆతడి పేరునూ సెలక్టర్లు పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా ఇది మంచి ఛాన్స్. ఈ సిరీస్‌లో బ్యాట్‌తో సత్తా చాటితే అంతర్జాతీయ టీ20 సిరీస్ ఎంపికలో ముందు వరసలో ఉంటాడు. ఇప్పటికే ఐపీఎల్లో చెన్నై తరఫున అదరగొట్టిన గైక్వాడ్‌కు నాయకత్వ లక్షణాలు కూడా ఉండడం కాస్త కలిసొచ్చే అంశం. చూడాలి మరి ఈ యంగ్‌స్టర్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటాడో?
ఇక వరల్డ్‌కప్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రింకూ సింగ్ కూడా ఈ సిరీస్‌లో తన మార్క్ చూపేందుకు తహతహలాడుతున్నాడు. వికెట్ కీపర్‌గా జితేశ్ శర్మ దాదాపు ఫిక్స్. బౌలింగ్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనుండగా, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్ పేస్ దళాన్ని నడిపించాల్సి ఉంటుంది.