Ind vs SL 3rd ODI 2024:శ్రీలంక పర్యటనలో భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంక 110 పరుగుల తేడాతో నెగ్గింది. శ్రీలంక నిర్దేశించిన 249 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 26 ఓవర్లలో 138 స్కోర్ వద్ద ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (35 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలగే 5, వాండర్సే 2, మహీషా తీక్షణ 2, అశిత ఫెర్నాండో 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో శ్రీలంక 2-0 తేడాతో వన్డే సిరీస్ దక్కించుకుంది.
240 పరుగుల లక్ష్య ఛేదనను టీమ్ఇండియా ధీటుగానే ప్రారంభించింది. 7 ఓవర్లకే స్కోర్ 50 పరుగులు దాటింది. రోహిత్ శర్మ మరోసారి ధనాధన్ బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఐదో ఓవర్లో శుభ్‌మన్ గిల్ (6 పరుగులు) సిరీస్‌లో వరుసగా ముూడోసారి విఫలమయ్యాడు. ఇక ధాటిగా ఆడుతున్న రోహిత్ కూడా 7.1 వద్ద క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత మిగతా బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.
వరుసగా రిషభ్ పంత్ (6 పరుగులు), విరాట్ కోహ్లీ (20 పరుగులు), అక్షర్ పటేల్ (2 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (8 పరుగులు), రియాన్ పరాగ్ (15 పరుగులు) త్వరత్వరగా ఔటయ్యారు. దీంతో భారత్ 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దీంతో అప్పుడే టీమ్ఇండియా ఓటమి దాదాపు ఖరారైంది. అయితే చివర్లో వాషింగ్టన్ సుందర్ (30 పరుగులు) పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించాడు. చివర్లో కుల్దీప్ (6 పరుగులు) వెనుదిరగడంతో 138 స్కోర్ వద్ద భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.