Ind vs SL 1st T20:శ్రీలంక పర్యటనలో టీమ్ఇండియా శుభారంభం చేసింది. ఆతిథ్య లంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 43 పరుగుల తేడాతో నెగ్గింది. భారత్ నిర్దేశించిన 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక 19.2ఓవర్లలో 170కే ఆలౌటైంది. ఓపెనర్ పాతుమ్ నిస్సంకా (79 పరుగులు) భారీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. కుశాల్ మెండీస్ (45 పరుగులు) రాణించాడు. మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేదు. భారత్ బౌలర్లలో రియాన్ పరాగ్ 3, అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2, మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 213పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (40 పరుగులు, 21 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (34 పరుగులు, 16 బంతుల్లో) అదిరే ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ పవర్ ప్లేలోనే జట్టు స్కోర్ 70 దాటించారు. తొలి వికెట్‌కు 5.6ఓవర్లలో 74 పరుగుల భాగస్వామ్యం చేశారు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లంక బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.