తెలంగాణ

telangana

ETV Bharat / sports

మ్యాచ్ రద్దైతే టిక్కెట్‌ డబ్బు రీఫండ్‌ పొందడం ఎలా? - CRICKET MATCH TICKET REFUND

చాలా మందికి స్టేడియంలో క్రికట్‌ మ్యాచ్‌ చూడాలనే కోరిక ఉంటుంది. కొందరికి అంత డబ్బు పెట్టి టిక్కెట్‌ కొన్నాక, మ్యాచ్‌ రద్దు అయితే ఎలా? అనే ఆందోళన ఉండవచ్చు.

source IANS and Getty Images
Cricket Match Tickets Refund Process (source IANS and Getty Images)

By ETV Bharat Sports Team

Published : Oct 14, 2024, 7:20 PM IST

Cricket Match Tickets Refund Process : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు అభిమానులు ఉంటారు. కొందరు ఫేవరెట్‌ టీమ్‌ మ్యాచ్‌లు చూడటానికి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్తుంటారు. అలానే చాలా మంది తమ సొంత నగరం, రాష్ట్రంలో జరిగే మ్యాచ్‌లు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. వేల రూపాయలు చెల్లించి ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఐపీఎల్‌ సమయంలో ఆయా నగరాల్లో టిక్కెట్ల కోసం భారీ క్యూలు చూసే ఉంటారు.

స్టేడియంలో తమ ఫేవరెట్ టీమ్‌, ప్లేయర్‌ ఆడటం చూడటానికి ఆశపడుతుంటారు. అయితే కొన్ని సమయాల్లో వర్షం లేదా ఇతర కారణాలతో మ్యాచ్‌ రద్దవుతుంది. ఎంతో శ్రమపడి స్టేడియంకి వెళ్లిన అభిమానులు చాలా నిరాశపడతారు. టిక్కెట్‌ డబ్బులు వృథా అయిపోయాయని బాధపడుతుంటారు. ఆ టికెట్ డబ్బులను రీఫండ్​ ఎలా పొందాలనే ఆందోళన కూడా ఉంటుంది.

అయితే మ్యాచ్ రద్దు అయితే, అందరూ తమ టిక్కెట్‌ డబ్బులను వాపసు పొందవచ్చు. కానీ పూర్తిగా టిక్కెట్‌ డబ్బులు అందకపోవచ్చు. ఎంత డబ్బు రీఫండ్‌ అవుతుందనేది మ్యాచ్‌ రద్దయిన కారణం, ఇతర కండిషన్లుపై ఆధారపడి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • టిక్కెట్‌ డబ్బును తిరిగి పొందేందుకు నియమాలు

మీరు తిరిగి పొందే డబ్బు మొత్తం మ్యాచ్ ఎప్పుడు, ఎందుకు రద్దు అయిందనే దానిపై ఆధారపడి ఉంటుంది.

  • టాస్‌కు ముందు: పూర్తి వాపసు
    టాస్‌కు ముందు మ్యాచ్ రద్దు అయితే మీరు మీ టిక్కెట్ ధర మొత్తం వెనక్కి పొందుతారు.
  • మ్యాచ్ రీషెడ్యూలింగ్: పూర్తి వాపసు
    ఏదైనా కారణం చేత మ్యాచ్ వేరే తేదీకి వాయిదా పడితే, మీరు ఆ తేదీలో మ్యాచ్‌కు హాజరు కాలేకపోతే, పూర్తి అమౌంట్‌ రీఫండ్‌ పొందవచ్చు.
  • నో బాల్ బౌల్డ్: పూర్తి వాపసు
    మ్యాచ్ రద్దు అయి, ఒక్క బాల్‌ కూడా వేసే అవకాశం లేకపోతే, మీ టిక్కెట్‌ డబ్బులు మొత్తం వాపసు పొందుతారు.
  • మ్యాచ్‌ ఫలితం తేలకపోతే?
    మ్యాచ్ ప్రారంభమైనప్పటికీ (ఉదాహరణకు వర్షం కారణంగా) మధ్యలోనే ఆగిపోతే, ఫలితం తేలకపోతే, కొంత మొత్తమే వాపసు పొందుతారు. ఉదాహరణకు 20 ఓవర్ల మ్యాచ్‌లో కేవలం 10 ఓవర్లు మాత్రమే ఆడితే, మీ టిక్కెట్ ధరలో 50% అందుకుంటారు. అంటే టిక్కెట్‌కు రూ.5,000 చెల్లిస్తే, మీకు రూ.2,500 తిరిగి వస్తుంది.
  • రిజర్వ్ డేలో మ్యాచ్ ఆడకపోతే?
    మ్యాచ్‌ రిజర్వ్‌ డేకి వెళ్తే, ఆ రోజు కూడా(వాతావరణం, ఇతర కారణాలు)తో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాకపోతే మీరు పూర్తి రీఫండ్‌ అందుకుంటారు.రిజర్వ్ డేలో 10 ఓవర్ల కంటే తక్కువ బౌలింగ్ చేస్తే, మీకు పూర్తి వాపసు లభిస్తుంది.
  • మాన్యువల్ రీఫండ్ ఆప్షన్‌
    ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేసేటప్పుడు, కొన్ని ప్లాట్‌ఫామ్‌లు అదనపు ఫీజులు వసూలు చేసి ‘మాన్యువల్ రీఫండ్’ ఆప్షన్‌ కల్పిస్తాయి. వ్యక్తిగత కారణాల వల్ల కూడా మీరు మ్యాచ్‌కు హాజరు కాలేకపోతే, రీఫండ్‌ పొందవచ్చు.
  • రీఫండ్‌ ఎలా పొందాలి? వాపసును ఎలా క్లెయిమ్ చేయాలి
    మీ రీఫండ్ పొందే ప్రక్రియ మీరు మీ టిక్కెట్‌ను ఎలా కొనుగోలు చేశారు? ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో కొన్నారా? అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఆఫ్‌లైన్ టిక్కెట్‌: రీఫండ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మీ టిక్కెట్‌ చిరిగిపోకుండా సరిగా ఉండేలా చూసుకోండి. వాట్సాప్ ద్వారా మీ రీఫండ్ గురించిన అప్‌డేట్ మీకు అందుతుంది. రీఫండ్‌ను క్లెయిమ్ చేయడానికి, వ్యక్తిగతంగా బాక్స్ ఆఫీస్‌ను సందర్శించి, టిక్కెట్‌తో పాటు మీ ఆధార్ కార్డ్‌ను చూపించండి.

ఆన్‌లైన్ టిక్కెట్‌:మీరు మీ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే, రీఫండ్‌ ఆటోమేటిక్‌గా ప్రాసెస్‌ అవుతుంది. డబ్బు సాధారణంగా 10 నుంచి 20 రోజుల్లోపు మీ అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది. మీరు మీ టిక్కెట్‌లను కొనుగోలు చేసే వెబ్‌సైట్ లేదా సంస్థ రీఫండ్‌ పాలసీని ఎప్పుడూ చెక్‌ చేయడం మంచిది.

'ఆ చర్చ అనవసరం - అలా చేయడం మానండి' - కోహ్లీపై గంభీర్ కీలక కామెంట్స్​!

పాకిస్థాన్​ గెలుపుపై భారత జట్టు ఆశలు! - అలా జరగకపోతే ఇక అంతే!

ABOUT THE AUTHOR

...view details