IND VS ENG Test Series 2024 Bazball : టీమ్ ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో క్రికెట్ అభిమానులకు బాగా వినిపిస్తున్న పేరు 'బజ్‌బాల్'. వాస్తవానికి ఈ పేరును గత కొంతకాలంగా బాగా వింటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఇంగ్లాండ్ టెస్టుల్లో దూకుడు శైలితో ఆడడం ప్రారంభించాక దీని గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. ఈ బజ్ బాల్తోనే ఎన్నో టీమ్‌లను చిత్తు చేసింది ఇంగ్లీష్ జట్టు. కానీ టీమ్ ఇండియాపై ఆ ప్రభావం కనపడట్లేదు. అసలీ టెస్ట్ క్రికెట్‌లో బజ్ బాల్ ఎలా వచ్చింది? దానికి అర్థం ఏంటి తెలుసుకుందాం.
బజ్‌బాల్ పేరు ఎలా వచ్చిందంటే? హెడ్ కోచ్ మెక్‌కల్లమ్ ముద్దు పేరు నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో యూకే ఎడిటర్ ఆండ్రూ మిల్లర్ తొలిసారి ఈ బజ్‌బాల్ పదాన్ని వినియోగించారు. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ టెస్ట్ బ్యాటింగ్ అప్రోచ్‌ను వివరిస్తూ ఈ పదాన్ని ఉపయోగించారు. .
బజ్‌బాల్ అంటే ఏంటంటే? టెస్ట్ క్రికెట్ అంటే చాలా నెమ్మదిగా సాగే ఫార్మాట్ అన్న సంగతి తెలిసిందే. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటర్ ఆడటం ఈ ఫార్మాట్ సహజ శైలి. అయితే ఈ టెస్టుల్లో పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రత్యర్థి ఎవరా? బౌలర్ ఎవరా? అనేది అస్సలు పట్టించుకోకుండా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఆడటాన్నే బజ్ బాల్‌గా అభివర్ణించారు.
మొదట 2019- 2022 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సమయంలో ఇంగ్లాండ్ దారుణంగా విఫలమైంది. అలాగే యాషెస్ సిరీస్‌తో పాటు భారత్‌పైనా చిత్తుగా ఓడింది. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రక్షాళన చేసి హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్, కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌ను నియమించింది. వీరిద్దరిది దూకుడుగా బ్యాటింగ్ చేసే శైలి. అలా వారిద్దరు తమ జట్టుకు దూకుడుగా ప్రదర్శించే తీరును అలవాటు చేశారు. భయం లేకుండా ఆడడం బాగా అలవాటు చేశారు. ఆఖరికి జిడ్డు బ్యాటింగ్ చేసే జోరూట్ కూడా సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడేలా చేసేశారు.