Ind vs Eng 3rd Test 2024:రాజ్‌కోట్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 207-2తో నిలిచింది. దీంతో ఇంగ్లాండ్ ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్ బెన్ డకెట్ (133 పరుగులు) సెంచరీతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ జాక్ క్రీలీ (15), ఒలీ పోప్ (39) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో డకెట్, జో రూట్ (9) ఉన్నారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ , మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. 326-5తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ అదనంగా మరో 119 పరుగులు జోడించింది. జడేజా ఓవర్‌నైట్ స్కోర్ 110కి కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అరంగేట్ర బ్యాటర్ ధ్రువ్ జురెల్ (46 పరుగులు) హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఇక ఆఖర్లో రవిచంద్రన్ అశ్విన్ (37), జస్ప్రీత్ బుమ్రా (26) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4, రెహన్ అహ్మద్ 2, జో రూట్, జేమ్స్ అండర్సన్, టామ్ హార్ల్టీ తలో వికెట్ దక్కించుకున్నారు.
తొలి రోజు బ్యాటింగ్‌లో భారత్‌దే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు. ఇక మిడిల్లో వచ్చిన రజత్ పటీదార్ (5) మరోసారి విఫలమయ్యాడు. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ (132 పరుగులు), జడేజా (112 పరుగులు) సెంచరీలతో మోత మోగించారు. మరో డెబ్యూ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ వచ్చీ రావడంతోనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే 62 పరుగులు చేశాడు.