IND VS BAN Virat Kohli Gambhir Interview : భారత హెడ్ కోచ్ గంభీర్, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయని చాలా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆన్ ఫీల్డ్‌లో అయితే ఇద్దరి మధ్య వివాదం చెలరేగినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. లఖ్‌నవూ మెంటార్‌గా ఉన్న సమయంలో కూడా గంభీర్, ఆర్సీబీ ప్లేయరైన విరాట్ కోహ్లీకి గొడవ జరగడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విరాట్‌పై గంభీర్ విమర్శలు గుప్పించేవాడు. అయితే గంభీర్ టీమ్ ఇండియా హెచ్ కోచ్‌గా వచ్చిన తర్వాత పరిస్థితులు దాదాపుగా మారిపోయాయి.
సరదాగా మారిపోయిన గంభీర్, కోహ్లీ -గంభీర్ హెడ్ కోచ్‌గా జట్టుతో కలిశాక అతడికి, కోహ్లీకి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఇద్దరూ కలిసి చాలాసార్లు ప్రాక్టీసు సెషన్లో జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ కనిపించారు. గంభీర్‌తో గతంలో జరిగిన ఘటనలు తమ బంధంపై ప్రభావం చూపించవని కోహ్లీ గతంలో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా గంభీర్-కోహ్లీ మధ్య మనస్పర్థలు లేవని నిరూపించే ఓ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
గౌతీ- కింగ్ స్పెషల్ ఇంటర్వ్యూ -వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ పేరుతో నిమిషం 40 సెకన్ల నిడివి ఉన్న వీడియోను షేర్ చేసింది బీసీసీఐ. ఇందులో బ్యాటర్ ఏకాగ్రతను స్లెడ్జింగ్ ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి కోహ్లీ, గంభీర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థులతో మాట్లాడుతూ (ఆర్గ్యూమెంట్ చేస్తున్నప్పుడు) ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? మాటల్లో పడి పరధ్యానంగా ఔట్ అయ్యే ప్రమాదం ఉందా? లేదంటే బాగా మోటివేట్ అయ్యి ఇంకా మంచిగా ఆడే అవకాశం ఉందా? అని గౌతీని కోహ్లీ ప్రశ్నించాడు.
అందుకు గౌతీ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. 'నా కన్నా నీకే ప్రత్యర్థులతో ఎక్కువ గొడవలు జరిగాయి. నువ్వే ఆ ప్రశ్నకు నాకంటే బాగా సమాధానం చెప్పగలవని భావిస్తున్నాను.' అని గౌతీ సమాధానం చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ఇంటర్వ్యూలో నవ్వులు విరబూశాయి. అలాగే 2014-15లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కోహ్లీ చాలా పరుగులు సాధించాడని గంభీర్ ప్రశంసించాడు. కోహ్లీని ప్రత్యర్థులు రెచ్చగొట్టడం వల్లే ఇరగదీశాడని వ్యాఖ్యానించాడు. తాను అందుకే న్యూజిలాండ్‌తో 2009లో జరిగిన మ్యాచులో అదరగొట్టానని చెప్పుకొచ్చాడు.