తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేఎల్ రాహుల్‌ దూకుడు - కోహ్లీ, రోహిత్, పంత్ కన్నా అతడే బెటర్​ - IND VS AUS 3RD TEST KL RAHUL

టీమ్‌ఇండియాను ఆదుకుంటున్న రాహుల్‌ - సేనా దేశాల్లో అతడే టాప్

IND VS AUS 3RD TEST KL RAHUL
IND VS AUS 3RD TEST KL RAHUL (source ANI)

By ETV Bharat Sports Team

Published : Dec 17, 2024, 6:51 PM IST

IND VS AUS 3RD TEST KL RAHUL : 2024 బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో మూడో టెస్టు కీలక మలుపులు తిరుగుతోంది. బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరుగుతున్న మ్యాచ్‌లో 4వ రోజు ఆసక్తికరంగా ముగిసింది. ఎట్టకేలకు టీమ్‌ఇండియా ఫాలో ఆన్‌ నుంచి బయటపడింది. మూడో టెస్ట్‌కు వర్షం చాలా సార్లు అంతరాయం కలిగించింది. దాదాపు రెండు రోజుల ఆట జరగలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా, భారత్‌ 51/4 స్కోరుతో నాలుగో రోజు ప్రారంభించింది. టీమ్‌ఇండియాను ఫాలో ఆన్‌ నుంచి బయటపడేయడంలో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కీలక పాత్ర పోషించాడు. 139 బంతుల్లో 84 పరుగులు చేశాడు.

రవీంద్ర జడేజా 123 బంతుల్లో 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆట ముగిసే సమయానికి భారత్‌ 252/9 వద్ద ఉంది. క్రీజులో జస్ప్రీత్ బుమ్రా(10), ఆకాష్ దీప్(27) ఉన్నారు. చివరి వికెట్‌కు వీరు అజేయంగా 39 పరుగులు జోడించారు. ఈ పార్ట్‌నర్‌షిప్‌ కూడా ఫాలో ఆన్‌ గండం తప్పించడంలో కీ రోల్‌ ప్లే చేసింది. ఈ నేపథ్యంలోనే నాలుగో రోజు ఆటపై కేఎల్ రాహుల్ తన ఆలోచనలు షేర్‌ చేసుకున్నాడు.

మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్, "నేను మళ్లీ ప్యాడ్‌లు కట్టుకుని బ్యాటింగ్‌కు వెళ్లడం గురించి ఆలోచించాను. వారు ఫాలో-ఆన్‌ను అమలు చేస్తారో లేదో నాకు కచ్చితంగా తెలీదు. లోయర్ ఆర్డర్ విలువైన పరుగులు సాధించడం చూస్తుంటే చాలా బాగుంది. ఇది మేము చాలా తరచుగా చర్చించుకునే విషయం. బౌలర్లు తమ బ్యాటింగ్‌పై చాలా కష్టపడతారు. బుమ్రా, ఆకాష్ దీప్ అద్భుతంగా పోరాడారు. ఫాలో-ఆన్‌ను తప్పించారు. వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి, ఇప్పటికే చాలా ఆట రద్దు అయింది. మేము గేమ్‌లో ఉండాల్సిన అవసరం ఉంది. ఆకాశ్, బుమ్రా ఆ పని చేయగలిగారు. బౌలర్లు నెట్స్‌లో చాలా కష్టపడి పని చేస్తారు. అవసరమైనప్పుడు వారి ప్రయత్నం ఫలించినందుకు సంతోషంగా ఉన్నాను. చివరి అరగంటలో వారు బౌన్సర్లను ఎదుర్కొని ధైర్యంగా నిలిచిన తీరు ఆకట్టుకుంది." అని చెప్పాడు.

  • కెప్టెన్‌, కోచ్‌ నుంచి మెసేజ్‌
    టీమ్‌ఇండియా ఫాలో ఆన్‌ తప్పించుకోవడానికి చేరువయ్యాక ఆకాశ్ దీప్‌ షాట్లు ఆడాడు. దీంతో దూకుడు తగ్గించి సింగిల్స్ అందుకోవాలి బుమ్రాతో పాటు ఆకాశ్‌కు డ్రెస్సింగ్ రూమ్‌ నుంచి కెప్టెన్, కోచ్‌ ఓ మెసేజ్ పంపారని రాహుల్ చెప్పాడు. మెసేజ్‌లో, 'పరుగులు సాధించడానికి ప్రయత్నించండి. అలా అని బౌండరీలకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. షాట్లు ఆడతారనే ఉద్దేశంతో ఫీల్డర్లను దూరంగా మోహరించారు. సింగిల్స్ తీస్తే సరిపోతుంది.' అని చెప్పారని పేర్కొన్నాడు.
  • ఏం జరగవచ్చు?
    5వ రోజు భారత్ 193 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించడానికి ఆస్ట్రేలియా మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. వర్షం ముప్పు ఉండటంతో, మ్యాచ్‌ చాలా వరకు డ్రా దిశగా వెళ్లే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తే రెండు జట్లు 1-1తో సమంగా ఉంటాయి. డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు మొదలవుతుంది.
  • టీమ్‌ఇండియాను ఆదుకుంటున్న రాహుల్‌ - సేనా దేశాల్లో అతడే బెటర్
    రాహుల్‌ గత న్యూజిలాండ్‌ సిరీస్‌కు ఎంపికైనా బరిలో దిగే అవకాశం రాలేదు. సర్ఫరాజ్‌ ఖాన్‌ 150 పరుగులు చేయడంతో, రాహుల్‌కు జట్టులో చోటు దొరకడం కష్టమైంది. అయితే ఆస్ట్రేలియా పిచ్‌లు దృష్టిలో పెట్టుకొని మేనేజ్‌మెంట్‌ అతడిని బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీకి తీసుకుంది. తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌ మినహాయించి భారత బ్యాటర్లు వరుసగా విఫలమవుతున్నారు. కానీ రాహుల్‌ కీలక ఇన్నింగ్స్‌లు ఆడి పరువు కాపాడుతున్నాడు. మూడో టెస్టులో కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

    ఓ వైపు వికెట్లు పడుతున్నా రాహుల్‌ మాత్రం ఓపిగ్గా ఆడాడు. అనుకూలమైన బంతులను మాత్రమే షాట్లు ఆడాడు. ఆసీస్‌ బౌలర్ల ఆఫ్‌సైడ్‌ బంతులను మంచి ఫుట్‌ వర్క్‌తో ఎదుర్కొన్నాడు. కోహ్లీ, రోహిత్‌ ప్యాడ్ల వద్ద ఆడిన బంతులను రాహుల్‌ శరీరానికి దగ్గరగా ఆడటం గమనార్హం. బంతి దగ్గరకు వచ్చేవరకు ఎదురు చూసి షాట్లు ఆడాడు.

    సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా (సేనా దేశాలు) వికెట్లపై 2020 నుంచి రాహుల్‌ నిలకడగా రాణిస్తున్నాడు. ఈ దేశాల్లో రాహుల్‌ యావరేజ్‌ 41.5. మిగతా స్టార్‌ బ్యాటర్ల యావరేజ్‌ విరాట్‌ (30.4), పంత్‌ (34.8), రోహిత్‌ (33.2)గా ఉంది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో రాహుల్‌ టాప్‌ స్కోరర్‌ కావడం గమనార్హం.

    టీ20ల్లో సంచలనం - 4 బంతుల్లో 4 వికెట్లు - డబుల్ హ్యాట్రిక్ తీసిన పేసర్

టాప్-3లోకి దూసుకొచ్చిన స్మృతి మంధాన

ABOUT THE AUTHOR

...view details